మాజీ ఆర్మీ చీఫ్ నరవణె బుక్ వివాదం..పెంగ్విన్ హౌస్ ఇండియా క్లారిటీ

మాజీ ఆర్మీ చీఫ్ నరవణె బుక్  వివాదం..పెంగ్విన్  హౌస్  ఇండియా క్లారిటీ
  • కాపీలను సర్క్యులేట్ చేసిన వారిపై చర్యలు తప్పవని వార్నింగ్

న్యూఢిల్లీ: ఆర్మీ మాజీ చీఫ్  ఎంఎం నరవణె రచించిన ‘ఫోర్స్  స్టార్స్  ఆఫ్  డెస్టినీ’ పుస్తక వివాదంపై పెంగ్విన్  ర్యాండమ్  హౌస్  ఇండియా స్పందించింది. గత కొద్ది రోజులుగా పార్లమెంటులో ఈ పుస్తకంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతుండడం, పుస్తకం కాపీలు బయట చట్టవిరుద్ధంగా సర్క్యులేట్  అవుతున్న నేపథ్యంలో పెంగ్విన్  హౌస్  క్లారిటీ ఇచ్చింది. ఆ పుస్తకాన్ని తాము ఇంకా పబ్లిష్  చేయలేదని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్  ఇలా ఏ రూపంలోనూ బుక్​ను అందుబాటులోకి తేలేదని వెల్లడించింది. 

‘‘మనోజ్  ముకుంద్  నరవణె రాసిన ‘ఫోర్  స్టార్స్  ఆఫ్  డెస్టినీ’ పుస్తకానికి సంబంధించిన పబ్లిషింగ్  హక్కులు పూర్తిగా మాకే ఉన్నాయి. పుస్తకం కాపీలు ఇంకా పబ్లిక్ కు అందుబాటులోకి తేలేదు. కానీ, కొన్ని కాపీలు బయట సర్క్యులేట్ అవుతున్నాయి. అలా చేయడం కాపీరైట్  ఉల్లంఘన కిందకు వస్తుంది. ఎవరైనా కాపీలను డిజిటల్, ప్రింట్, పీడీఎఫ్  ఇలా ఏ రూపంలో సర్క్యులేట్  చేసినా కాపీరైట్  యాక్ట్  కింద వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. 

అంతేకాకుండా ఆ కాపీలను సీజ్  చేస్తాం” అని పెంగ్విన్  హౌస్  వెల్లడించింది. మరోవైపు పుస్తకం కాపీలు చట్టవిరుద్ధంగా సర్క్యులేట్  అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ నా పుస్తకం పరిస్థితి: నరవణె

తన పుస్తకంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో జనరల్ నరవణె స్పందించారు. పెంగ్విన్  ర్యాండమ్  హౌస్  ఇండియా ప్రకటనను ఎక్స్ హ్యాండిల్​లో షేర్ చేస్తూ ‘‘ఇదీ నా పుస్తకం పరిస్థతి” అని క్యాప్షన్ జోడించారు.