- ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ డీసీసీ అధ్యక్షులకు ఫిబ్రవరి 21 నుంచి స్పెషల్ ట్రైనింగ్ శిబిరాలు నిర్వహించనున్నట్టు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. సంస్థాగతంగా బలమైన పార్టీగా ఎదగడానికి ఈ కార్యక్రమం కీలకమని, కార్యకర్తలందరూ సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలోని ఇందిరా భవన్ లో సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన 286 మంది డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. వీరికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మార్గనిర్దేశం చేశారు. అనంతరం కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం దేశవ్యాప్తంగా వేగంగా కొనసాగుతున్నదని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ)ల వ్యవస్థను బలోపేతం చేస్తూ పెద్దఎత్తున నియామకాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం కింద 14 రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తైందని, 500కు పైగా జిల్లా స్థాయి నాయకులను నియమించామని పేర్కొన్నారు.
