న్యూఢిల్లీ: బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్) లో మంగళవారం పడ్డాయి. వెండి మార్చి డెలివరీ ఫ్యూచర్స్ ధర రూ.5,422 తగ్గి (2.06శాతం) కిలోకు రూ.2,57,198కి చేరింది. ఇది సోమవారం రూ.12,728 పెరిగి రూ.2,62,620 వద్ద ముగిసింది.
ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్ట్ రూ.677 (0.43శాతం) తగ్గి 10 గ్రాములకు రూ.1,57,389కి దిగొచ్చింది. గ్లోబల్ మార్కెట్లలో బలహీన సంకేతాలు, డాలర్ విలువ పెరగడం వల్ల ట్రేడర్లు లాభాలు బుక్ చేసుకున్నారు. అంతర్జాతీయంగా కామెక్స్‌లో సిల్వర్ 1.20శాతం నష్టపోయి ఔన్స్ (దాదాపు 28 గ్రాముల) కు 81.25 డాలర్లకి చేరింది. ఈ ఏడాది జనవరి 29న నమోదు చేసిన ఆల్‌టైమ్ హై 119.51 డాలర్ల నుంచి వెండి ధర 33శాతం పడింది.
గోల్డ్ కూడా 24 డాలర్లు తగ్గి ఔన్స్‌కు 5,055.21 డాలర్ల వద్ద ముగిసింది. ప్రాఫిట్ బుకింగ్, డాలర్ బలపడటం, గ్లోబల్ డిమాండ్ బలహీనత వలనే వెండి, గోల్డ్ ధరలు పడుతున్నాయని మార్కెట్ వర్గాలు అంచనావేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మాక్రో డేటా, పాలసీ సంకేతాలు బంగారం, వెండి ధరల దిశను నిర్ణయిస్తాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అమెరికా రిటైల్ సేల్స్, గ్లోబల్‌గా ఆర్థిక అనిశ్చితి వంటివి బంగారం ధరలకు మద్దతు ఇస్తాయని అంచనావేసింది.
హైదరాబాద్‌లో ఇలా..
వెండి, గోల్డ్ ధరలను ట్రాక్ చేసే గుడ్‌రిటర్న్స్ ప్రకారం, హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ ధర మంగళవారం రూ.870 పెరిగి రూ.1,58,780 కి చేరింది. వెండి ధర మాత్రం కేజీకి రూ.10 వేలు తగ్గి రూ.2,90,000 దగ్గర ఉంది.
