న్యూఢిల్లీ: అదానీ ఎంటర్‌ప్రైజెస్‌పై అమెరికా ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్ (ఓఎఫ్‌ఏసీ) విచారణ ప్రారంభించింది. ఇరాన్ నుంచి పెట్రోలియం ప్రొడక్ట్‌లను కొనుగోలు చేసిందనే ఆరోపణలపై సమాచారం కోరుతూ ఈ నెల 4న కంపెనీకి నోటీసులు జారీ చేసింది.
ఇది 2025 జూన్‌లో వాల్‌స్ట్రీట్ ప్రచురించిన రిపోర్ట్ ఆధారంగా జరిగింది. అదానీకి చెందిన సంస్థలు ఇరాన్ నుంచి ఎల్‌పీజీ దిగుమతి చేశాయని, యూఎస్ ఆంక్షలను తప్పించుకునేందుకు ప్రత్యేక షిప్పింగ్ మార్గాలు ఉపయోగించారని ఈ రిపోర్ట్ పేర్కొంది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, తమ పోర్టుల్లో ఇరాన్ నుంచి ఎలాంటి కార్గోను హ్యాండిల్ చేయలేదని, ఇరాన్ ఫ్లాగ్ ఉన్న నౌకలను అనుమతించలేదని స్పష్టం చేసింది.
‘‘ఓఎఫ్‌ఏసీ నుంచి వచ్చిన కమ్యూనికేషన్‌లో ఎలాంటి ఉల్లంఘనలు లేదా తప్పిదాలు ఉన్నాయని పేర్కొనలేదు. స్వచ్ఛందంగా సహకరిస్తూ, అవసరమైన సమాచారం అందిస్తాం”అని అదానీ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది.
తాము వివిధ దేశాల నుంచి చేసుకుంటున్న ఎల్‌పీజీ దిగుమతులను జూన్ 2, 2025 నుంచి నిలిపివేసినట్లు ప్రకటించింది. 2023లో అమెరికన్ కంపెనీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కూడా అదానీ గ్రూప్‌పై షేర్ మానిప్యులేషన్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
