బషీర్‌బాగ్, వెలుగు: బీజేపీ నేత మహాదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ నాయకులు కారణమంటూ బీజేపీ నాయకులు చేపట్టిన రాష్ట్ర డీజీపీ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప(48) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో ఈ ఆందోళన చేపట్టారు.
సోమవారం నిజాం క్లబ్ నుంచి డీజీపీ కార్యాలయం వైపు దూసుకొచ్చిన బీజేపీ నాయకులను పోలీసులు రెండంచెల భద్రతతో అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాటతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
స్థానిక మంత్రి వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి వల్లే మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డారని బీజేపీ నేతలు తుళ్ల వీరేందర్ గౌడ్, బండా కార్తీక, ఆనంద్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికలకు ఒకరోజు ముందు ఆత్మహత్య అనుమానాలకు తావిస్తోందని, పార్టీ మారాలని ఒత్తిడి చేశారని తెలిపారు.
