- లోక్సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉపాధి, లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించి పంపిన రెండు బిల్లులు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం లోక్సభలో కేంద్ర న్యాయ సామా జిక, సాధికార శాఖ సహాయ మంత్రి బీఎల్ వర్మ స్పష్టం చేశారు.
‘తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీ పంపిన బిల్లులు అందాయి. ఈ రెండు బిల్లులు రాష్ట్రపతి పరిశీలనలో ఉన్నాయి’ అని రాష్ట్ర ఎంపీ ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
గతేడాది మార్చిలో ఈ రెండు బిల్లులకు అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. ఆ తర్వాత అవి చట్ట రూపంలోకి మారేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం కోసం ప్రభుత్వం పంపింది. కానీ.. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో న్యాయసలహా కోరారు. అనంతరం వాటిని రాష్ట్రపతికి సిఫారసు చేశారు. అప్పటి నుంచి ఈ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్ లో ఉన్నాయి.
