ఏఐ టెక్నాలజీలు మన పనులను సులభతరం చేస్తున్నాయన్నది ఎంత నిజమో.. దానిపై గుడ్డిగా ఆధారపడితే కోలుకోలేని నష్టం జరుగుతుందన్నది కూడా అంతే నిజం. తాజాగా ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ కి ఎదురైన గుండె ఆగిపోయేంత భయంకరమైన సంఘటన దీనికి ఉదాహరణగా నిలిచింది. ఆంత్రోపిక్ సంస్థకు చెందిన 'క్లాడ్ కోవర్క్' అనే ఏఐ ఏజెంట్ 15 ఏళ్ల జ్ఞాపకాలను చిటికెలో తుడిచిపెట్టేసింది. అసలు ఏఐ చేసిన తప్పేంటి.. ఏఐల వాడకంలో జాగ్రత్త ఎంత వరకూ అవసరం అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బే ఏరియాకు చెందిన వెంచర్ క్యాపిటలిస్ట్ డేవిడ్సోవ్ తన భార్య డెస్క్‌టాప్‌ను కాస్త నీట్‌గా ఆర్గనైజ్ చేద్దామని భావించి.. క్లాడ్ కోవర్క్ ఏఐకి ఆ పనిని అప్పగించాడు. కేవలం టెంపరరీ ఆఫీస్ ఫైళ్లను మాత్రమే తొలగించమని ఆయన ఆదేశించారు. కానీ ఆ ఏఐ ఏజెంట్ చేసిన పొరపాటు అతన్ని నివ్వెరపోయేలా చేసింది. టెంపరరీ ఫైళ్లను క్లీన్ చేయడానికి బదులుగా.. ఆ ఏఐ ఏకంగా 15 ఏళ్ల నాటి ఫ్యామిలీ ఫోటోల ఫోల్డర్‌ను డిలీట్ చేసింది. ఇందులో వారి పెళ్లి ఫోటోలు, పిల్లల చిన్నప్పటి ఫోటోలు, స్నేహితుల ఫంక్షన్ల పిక్స్ ఇలా దాదాపు 15వేలకు పైగా వెలకట్టలేని జ్ఞాపకాలు ఉన్నాయి.
అంతేకాదు ఈ డిలీషన్ ప్రక్రియ సాధారణ ట్రాష్ లోకి వెళ్లకుండా నేరుగా టెర్మినల్ ద్వారా జరిగింది. దీనివల్ల ఆ ఫైళ్లు కంప్యూటర్ నుంచి పూర్తిగా తొలగించబడ్డాయని డేవిడ్సోవ్ వెల్లడించారు. సాధారణ రికవరీ టూల్స్ కూడా వీటిని గుర్తించలేకపోయాయని తెలిపారు. ఏఐ ఏజెంట్ ఫోల్డర్ పేరు మార్చడానికి ప్రయత్నించి, పొరపాటున అన్ని ఫోటోలను డిలీట్ చేసింది. ఇది చూసి నాకు గుండెపోటు వచ్చినంత పనైందని డేవిడ్సోవ్ ఎక్స్‌లో తన ఆవేదన వ్యక్తం చేశారు. టైమ్ మెషిన్ వంటి రికవరీ ఆప్షన్లు కూడా విఫలమవ్వడంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.
చివరికి ఆపిల్ సపోర్ట్ టీమ్‌ను సంప్రదించగా.. ఐక్లౌడ్ డ్రైవ్‌లోని ఒక ప్రత్యేక ఫీచర్ ద్వారా గత 30 రోజుల్లో డిలీట్ అయిన ఫైళ్లను తిరిగి పొందే అవకాశం దొరికిందని డేవిడ్సోవ్ వెల్లడించారు. అలా ఆ 15 వేల ఫోటోలు మళ్లీ వెనక్కి రావడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన తర్వాత డేవిడ్సోవ్ అందరినీ ఒకటే హెచ్చరిస్తున్నారు.. క్లాడ్ వంటి ఏఐ ఏజెంట్లను పర్సనల్ కంప్యూటర్ ఫైల్ సిస్టమ్‌లోకి నేరుగా అలౌవ్ చేయెుద్దని.. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దలేని పనులను ఏఐకి అప్పగించొద్దని సూచించారు. ఇది ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉందని అన్నారు.
క్లాడ్ కోవర్క్ అనేది మల్టీ-స్టెప్ పనులను నేరుగా కంప్యూటర్‌లో చేసేలా రూపొందించబడింది. కానీ ఇలాంటి సాంకేతికతను వాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఏఐని సహాయకుడిగా వాడుకోవాలే తప్ప, మన మొత్తం డిజిటల్ జీవితాన్ని దానికి అప్పగించేయడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.
