ఏఐ జెనరేటెడ్ లేబుల్ తప్పనిసరి.. ఏఐ ఫొటో, వీడియోలపై కేంద్రం కొత్త రూల్స్

ఏఐ జెనరేటెడ్  లేబుల్ తప్పనిసరి.. ఏఐ ఫొటో, వీడియోలపై కేంద్రం కొత్త రూల్స్
  •     ఏఐ ఫొటో, వీడియోలకు తప్పనిసరి చేసిన కేంద్రం
  •     ఏఐ దుర్వినియోగాన్ని ఆపేందుకు కేంద్రం కొత్త రూల్స్

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా తయారుచేసిన వీడియోలు, ఆడియోలు,  ఫొటోలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్​ను తీసుకొచ్చింది. ఈ నెల 20 నుంచి ఈ  కొత్త రూల్స్ అమలులోకి వస్తాయి. కేంద్రం ప్రకారం.. ఇకపై ఎవరైనా ఫొటో, వీడియో, ఆడియోను ఏఐ సాఫ్ట్‌‌వేర్‌‌తో తయారు చేసి ఆన్‌‌లైన్‌‌లో పోస్ట్ చేస్తే అది ఏఐతో క్రియేట్ చేసినట్లు ఫేస్‌‌బుక్, ఇన్‌‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌లు“డిక్లేర్” ఇవ్వాలి. అలాగే, ఏఐ కంటెంట్​పై “ఏఐ జెనరేటెడ్” లేదా “సింథటిక్ కంటెంట్” అని లేబుల్ తప్పనిసరిగా పెట్టాలి. ఎవరైనా లేబుల్‌‌ను తీసేస్తే నేరంగా పరిగణించనున్నారు. ఏఐతో ఎవరి ముఖాన్నైనా మార్చి చూపించడం(డీప్‌‌ఫేక్), ఎవరినైనా తప్పుగా చూపించడం, అశ్లీల ఫొటోలు తయారు చేయడం, ఎన్నికల్లో మోసం చేయడానికి ఉపయోగిస్తే సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌లు ఆటోమేటిక్‌‌గా గుర్తించాలి. వెంటనే కంటెంట్‌‌ను తీసేయాలి. డీప్‌‌ఫేక్‌‌లు, అబద్ధాలు, అశ్లీల కంటెంట్‌‌ను 

పూర్తిగా ఆపేయాలి. “ఈ వీడియో/ఫొటోను తీసేయండి” అని ప్రభుత్వంగాని, కోర్టుగాని చెబితే సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌లు 3 గంటల్లోగా ఆ కంటెంట్‌‌ను తీసేయాలి. గతంలో ఇది 36 గంటలుగా ఉండేది. సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌లు ప్రతి 3 నెలలకు ఒకసారి తమ యూజర్లకు “ఏఐ కంటెంట్ దుర్వినియోగం చేయకండి, దానికి శిక్ష ఉంటుంది” అని హెచ్చరించాలి. ఏఐతో రోజురోజుకూ అశ్లీల వీడియోలు, అభ్యంతరకర ఫొటోలు, చట్టవిరుద్ధమైన కంటెంట్ క్రియేట్ అవుతుండటం, సోషల్ మీడియా ప్లాట్‌‌ఫామ్‌‌ల్లో అవి వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ రూల్స్ తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇకపై ఏఐతో తయారైన కంటెంట్ చూసినప్పుడు అది నిజమైనదా లేక ఏఐతో చేసినదా అని సులభంగా తెలుస్తుందని వెల్లడించింది.  ఈ చర్య  ప్రజలను మోసం నుంచి కాపాడుతుందని కేంద్రం పేర్కొంది.