హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పల్లి(వేరుశనగ) పంట సాగు ఈ సీజన్‌లో భారీగా తగ్గింది. గతేడాది 2.45 లక్షల ఎకరాల్లో సాగు జరగ్గా.. ఈ సారి కేవలం 1.83 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట వేశారు. ఇది సాధారణ సాగు కంటే 77 వేల ఎకరాలు తక్కువ. వేరుశనగ చేన్లపై కోతులు దాడి చేసి మొక్కలు పీకి పంటను నాశనం చేస్తున్నాయి. ఈ బెడద తట్టుకోలేక రైతులు పల్లి సాగుకు ముందుకు రావడం లేదు. ఫలితంగా పంట దిగుబడులు తగ్గడంతో మార్కెట్‌లో డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో క్వింటాల్‌కు రూ.11 వేలకు పైగా ధరలు పలుకుతున్నాయి. గత నెల నుంచి మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే ఎక్కువే రేటు వస్తున్నది. పంట ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తున్నది. ప్రస్తుతం మార్కెట్‌లో రోజువారీగా 10 వేల నుంచి 5 వేల క్వింటాళ్ల వరకు పల్లి వస్తున్నది. శనివారం నాగర్‌కర్నూల్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.11,159 పలికింది. మహబూబ్‌నగర్‌లో రూ.11,106, నారాయణపేట్‌లో రూ.10,259, తిరుమలగిరిలో రూ.9,543. గత వారం రోజులుగా 9 వేలకు పైగా ధరలు నమోదవుతున్నాయి. మద్దతు ధర రూ.7,263 మాత్రమే కాగా, మార్కెట్‌లో రెండు నుంచి మూడు నాలుగు వేలకు పైగా అదనంగా పలుకుతోంది. మంగళవారం నారాయణపేట్‌లో రూ.9,308, తిరుమలగిరిలో రూ.9,269, నాగర్‌కర్నూల్‌లో రూ.9,129 పలికాయి. యావరేజ్ ధర 8,500 నుంచి 8,900 వరకు ఉంది. సోమవారం రూ.10,300 వరకు, 8వ తేదీన రూ.9,500 వరకు ధరలు నమోదయ్యాయి. రైతులు కోతుల బెడద నుంచి రక్షణ చర్యలు తీసుకుంటే సాగు విస్తీర్ణం పెరిగి, ఉత్పత్తి మెరుగుపడుతుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
పల్లి వేసే జిల్లాల్లో పడిపోయిన సాగు
నాగర్‌కర్నూల్ జిల్లాలో పల్లి సాధారణ సాగు 1.26 లక్షల ఎకరాలు కాగా, ఈ ఏడాది 99 వేల ఎకరాల్లోనే వేశారు. వనపర్తి జిల్లాలో సాధారణ సాగు 25 వేల ఎకరాలు అయితే ఈసారి 10,707 ఎకరాలు మాత్రమే సాగైంది. గద్వాల జిల్లాలో 16 వేల ఎకరాల సాధారణ సాగుకు బదులు 5,583 ఎకరాలు, నల్గొండలో 23 వేల ఎకరాలు కాగా, 19,555 ఎకరాలు, నారాయణపేట్‌లో సాధారణ సాగు 10 వేల ఎకరాల అయితే 6 వేల ఎకరాల్లో మాత్రమే వేశారు.
