- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రం
- పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సామగ్రి
- ఉమ్మడి జిల్లాలో 324 వార్డుల్లో బరిలో 1584 మంది అభ్యర్థులు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 6,60,108 మంది ఓటర్లు
ఆదిలాబాద్, నెట్వర్క్ వెలుగు: పుర ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికలు రానే వచ్చాయి.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్, పది మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఎన్నికల సామగ్రిని ఆయా కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది మంగళవారం సాయంత్రం వరకు బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రాలకు తరలించారు.
ఆయా జిల్లాల కలెక్టర్లు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఆదిలాబాద్ టీటీడీసీ కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరయ్యే పీవో, ఏపీవోలకు పలు సూచనలు చేస్తూ ఎన్నికల సామగ్రి పంపిణీ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. భైంసాలోని ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు.
6002 మంది పోలింగ్ సిబ్బంది
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల కార్పొరేషన్ తో పాటు పది మున్సిపాలిటీల్లో 324 వార్డుల్లో 1584 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 6,60,108 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1025 పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు, జోనల్ ఆఫీసర్లు, పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు కలిపి మొత్తం 6002 మంది పోలింగ్ సిబ్బందిని నియమించారు.
భారీ పోలీసు బందోబస్తు
మున్సిపల్ ఎన్నిలకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పోలింగ్‌ను ఎస్పీలు పర్యవేక్షిస్తుండగా ఏఎస్పీ, డీఎస్పీలు, సీఐ, ఎస్సైలతో పాటు అదనపు బలగాలను రూట్ల వారీగా విధులు కేటాయించారు. మంచిర్యాల కార్పొరేషన్లో 1500 మంది పోలీసులు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో 1000 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 712 మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి ఎస్పీలు పలు సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు పోలింగ్ సరళిని పర్యవేక్షించనున్నారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించకుండా ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో అధికారులు సదుపాయాలు కల్పించారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలు కోరారు.
