- కాజీపేట బస్టాండ్ నిర్మాణానికి రైల్వే భూముల బదిలీపై ఏడాదిగా ముందుకు కదలని ప్రక్రియ
- అడుగుదూరంలో ఆగిన ఓరుగల్లువాసుల 45 ఏండ్ల కల
- ఎకరంన్నర ఇచ్చినట్లే ఇచ్చి ఏడాదిగా స్పందించని దక్షిణ రైల్వే ఆఫీసర్లు
- కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభమై..బస్టాండ్ లేకుంటే కష్టమే
వరంగల్, వెలుగు: ఓరుగల్లు వాసుల 45 ఏండ్ల కల అయిన కాజీపేట బస్టాండ్ నిర్మాణం మరోసారి భూ కేటాయింపు సమస్యతో నిలిచిపోయింది. బస్టాండ్ కోసం అవసరమైన రైల్వే భూములను అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ నాన్చడంతో పనులు ముందుకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మంత్రులు పలుమార్లు రైల్వే ఆఫీసర్లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం నేపథ్యంలో బస్టాండ్ అవసరాన్ని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే ఆఫీసర్లు పలుమార్లు స్థలాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించినా, భూ కేటాయింపుపై తుది అనుమతులు మాత్రం పెండింగ్‌లోనే ఉన్నాయి.
ఓరుగల్లులో కాజీపేటకే అన్యాయం
ట్రైసిటీల్లో వరంగల్, హనుమకొండలకు దాదాపు 50 ఏండ్ల నుంచే బస్టాండ్లు, బస్ డిపోలు అందుబాటులో ఉన్నాయి. అయితే కాజీపేటకు ఇప్పటికీ బస్టాండ్ లేకపోవడం స్థానికుల ఆవేదనగా మారింది. ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని కలిపే కీలక రైల్వే జంక్షన్‌గా కాజీపేటకు ప్రత్యేక గుర్తింపు ఉన్నా, రైలులో వచ్చే వేలాది మంది ప్రయాణికులు కరీంనగర్, భూపాలపల్లి తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే ఏడు కిలోమీటర్ల దూరంలోని హనుమకొండ బస్టాండ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
బస్టాండ్ పేరుతో రాజకీయాలు
‘కాజీపేట బస్టాండ్ నిర్మాణమే మా ధ్యేయం’ అనే నినాదంతో పలువురు నేతలు రాజకీయంగా ఎదిగినా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. 1990లో దివంగత మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ ఈ అంశంపై ఉద్యమాలు చేసి రాజకీయాల్లో గుర్తింపు పొందారు. అనంతరం ఆయన సోదరుడు వినయ్ భాస్కర్ కూడా ఇదే హామీతో ప్రజల్లోకి వెళ్లి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ పాలనలోనూ సీఎం కేసీఆర్, కేటీఆర్ కాజీపేట బస్టాండ్‌పై హామీలు ఇచ్చినా నిర్మాణం కార్యరూపం దాల్చలేదు.
ఓకే చెప్పినా... ఏడాదిగా పెండింగ్
కాజీపేట సిటీలో హైదరాబాద్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్‌కు చెందిన సుమారు ఎకరన్నర స్థలంలో బస్టాండ్ నిర్మించాలని ప్రతిపాదించారు. దీనికి రైల్వే ఆఫీసర్లు ఓకే చెప్పారు. ఆ స్థలానికి బదులుగా మడికొండలోని సర్వే నంబర్ 1296లో ఉన్న సమాన విలువైన సీలింగ్భూమిని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 2025 జూన్ 4న అధికారిక ప్రతిపాదనలు పంపింది. భూమార్పిడి ప్రక్రియను వేగవంతం చేయాలని రెండు ప్రభుత్వాల అధికారులు నిర్ణయించినప్పటికీ, ఏడాది గడిచినా తుది అనుమతులు రాలేదు. ఇటీవల మరోసారి ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి రైల్వే ఆఫీసర్లను కలిసి భూమార్పిడి ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కోరారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం నేపథ్యంలో బస్టాండ్ అత్యవసరమని వివరించారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ వెంటనే స్పందించి భూముల బదిలీ పూర్తి చేస్తే బస్టాండ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే భూముల కోసం జిల్లా నేతల ఫైట్..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య బస్టాండ్ నిర్మాణంపై స్పెషల్ఫోకస్పెట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి రైల్వే భూముల బదిలీ కోసం పలుమార్లు ఆఫీసర్లతో చర్చించారు. గతేడాది జనవరి 28న ఎమ్మెల్యే నాయిని ఆధ్వర్యంలో ఎంపీ కావ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి సౌత్ సెంట్రల్ జోన్ రైల్వే జీఎంను కలిసి భూములు అప్పగించాలని కోరారు. అనంతరం ఏడీఆర్‌ఎం గోపాలకృష్ణన్ బృందం కాజీపేటలో మూడు స్థలాలను పరిశీలించి సానుకూల అభిప్రాయం వ్యక్తం చేసింది.
