హైదరాబాద్ మహానగర పాలనలో చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ తెలంగాణ ప్రభుత్వం సరికొత్త క్యూర్ 2026 చట్ట ముసాయిదాను ఇటీవల విడుదల చేసింది. 1955 నాటి పాత జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కాలానికి అనుగుణంగా భవిష్యత్ అవసరాల కోసం ఈ నూతన బిల్లును రూపకల్పన చేసింది. ఈ నూతన చట్ట ముసాయిదాపై ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు తెలియజేయవచ్చు. జీహెచ్ఎంసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే, ఈ నూతన బిల్లులో పాలనను మరింత పటిష్టం చేసేలా కొన్ని విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించారు. అందులో ప్రధానమైంది, మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలోనే తొలిసారి ట్రాన్స్ జెండర్ లకు అధికారిక ప్రాతినిధ్యం కల్పించటం కోసం చట్టబద్ధత కల్పించారు. తెలంగాణ వేగంగా పట్టణీకరణ దిశగా దూసుకుపోతోంది. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన అభివృద్ధి నేడు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, సిద్ధిపేట వంటి నగరాలకు విస్తరించింది. పరిశ్రమలు పెరుగుతున్నాయి. ఐటీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. పెట్టుబడులు వస్తున్నాయి.
పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం బలపడే అవకాశం
జనాభా పెరుగుతోంది. ఈ మార్పులకు అనుగుణంగా పట్టణ పాలన కూడా మారాల్సిన అవసరం ఏర్పడింది. పాత చట్టాలతో కొత్త నగరాలను నడపడం ఇక సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కాంప్రహెన్సివ్ అర్బన్ రిఫార్మ్ అండ్ ఎంపవర్‌మెంట్ (క్యూర్) చట్టం-2026 ముసాయిదా పట్టణ పాలనలో ఒక కీలక సంస్కరణగా చెప్పవచ్చు. అయితే ఈ చట్టం రాబోయే మూడు నుంచి నాలుగు దశాబ్దాల తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందిన దూర
దృష్టి పత్రంగా నిలవాలి.
ఒక నగరం ఎలా అభివృద్ధి చెందాలి. ప్రజలకు ఎలాంటి సేవలు అందాలి. ట్రాఫిక్, తాగునీరు, మురుగునీరు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, డిజిటల్ సేవలు, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ జవాబుదారీతనం ఎలా ఉండాలి అనే అంశాలన్నింటికీ సమాధానం చెప్పే సమగ్ర విధాన పత్రంగా ఉండాలి. అందుకే ప్రతిపాదిత క్యూర్ చట్టంలో మార్గదర్శక సూత్రాలు, ఐదేళ్ల పట్టణాభివృద్ధి కార్యాచరణ, వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళికలు, పనితీరు ప్రమాణాలు, ప్రజల భాగస్వామ్యాన్ని చట్టబద్ధం చేయాలి.
ఇవి అమల్లోకి వస్తే పట్టణ పాలనలో పారదర్శకత, నిరంతరత, జవాబుదారీతనం మరింత బలపడే అవకాశం ఉంది. దూరదృష్టితో క్యూర్ చట్టం రూపొందితే అది తెలంగాణకే కాదు.. దేశవ్యాప్తంగా పట్టణ పాలనకు ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు అభివృద్ధి చెందిన పట్టణ పాలన కూడా అంతే అవసరమనే సందేశాన్ని ఈ ముసాయిదా చట్టం బలంగా వినిపిస్తోంది.
- ఎం.ఎస్.ఎస్. సోమరాజు,
అడిషనల్ డైరెక్టర్,
మున్సిపల్ డిపార్టుమెంట్,
(అటవీ శాఖ మంత్రి పీఎస్)
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
