Ayesha Khan: మేమేం తప్పు చేశాం.. రోడ్డుపై నిలబడటమే నేరమా? అక్రమ అరెస్ట్‌పై ‘ధురంధర్’ నటి ఆగ్రహం

Ayesha Khan: మేమేం తప్పు చేశాం.. రోడ్డుపై నిలబడటమే నేరమా? అక్రమ అరెస్ట్‌పై ‘ధురంధర్’ నటి ఆగ్రహం

బాలీవుడ్ నటి ఆయేషా ఖాన్‌ను (Ayesha Khan) ముంబై పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం విడుదల చేశారు. ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ సినిమాలోని ‘షరారత్’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయేషా ఖాన్.. విద్యార్థుల హక్కులకు మద్దతుగా జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొని నిరసన చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం (జులై 22) ముంబైలోని దాదర్ ప్రాంతంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో జరిగిన విద్యా సంస్కరణల నిరసన కార్యక్రమం జరిగే సమయంలో ఆయేషా రోడ్డు పక్కన నిలబడి ఉంది. ఈ క్రమంలోనే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, కొంతసేపు పోలీస్ స్టేషన్‌లో ఉంచిన తర్వాత విడుదల చేశారు.

ఎలాంటి నినాదాలు చేయలేదు: ఆయేషా

అరెస్ట్ అనంతరం ఆయేషా ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. పోలీస్ వ్యాన్ నుంచి, అలాగే పోలీస్ స్టేషన్ నుంచి కొన్ని వీడియోలను షేర్ చేశారు. ‘‘నేను ఎలాంటి నినాదాలు చేయలేదు. నిరసనలో పాల్గొనలేదు. ఫ్లకార్డులు కూడా పట్టుకోలేదు. కేవలం శాంతియుతంగా అక్కడ నిలబడి ఉన్నాను. అయినప్పటికీ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నారు’’ అని ఆమె తెలిపారు.

సాయంత్రం సమయంలో నిరసన ప్రాంతానికి వెళ్లినట్లు చెబుతూ.. తన సోదరుడు, స్నేహితులను పోలీసులు వ్యాన్‌లోకి ఎక్కించడంతో, తాను మరో ఇద్దరు మహిళా స్నేహితులతో కలిసి రోడ్డుపక్కన నిలబడ్డానని వివరించారు. 15 మంది పోలీసులు చుట్టుముట్టారు: దాదాపు 15 మంది పోలీసు సిబ్బంది (మహిళా పోలీసులతో సహా) తమను చుట్టుముట్టి, పోలీస్ వ్యాన్ ఎక్కాలని ఒత్తిడి చేశారని ఆయేషా ఆరోపించారు. ‘‘మేము ఏం తప్పు చేశాం? ఎందుకు అదుపులోకి తీసుకుంటున్నారు?’’ అని పదే పదే ప్రశ్నించినా పోలీసులు ఏ సమాధానం చెప్పలేదని ఆమె పేర్కొన్నారు.

తమను బలవంతంగా వర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారని, అయితే స్టేషన్‌లోని అధికారులు పద్ధతిగానే మాట్లాడినప్పటికీ, అసలు నిరసన ప్రదేశంలో తమతో ప్రవర్తించిన తీరుపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. "రోడ్డుపై నిలబడటం ఎప్పటి నుంచి నేరమైంది?" అని ఆమె ప్రశ్నించారు.

విడుదల తర్వాత పోస్ట్..

దాదాపు మూడు గంటల కస్టడీ తర్వాత ఆయేషా ఖాన్ సోషల్ మీడియా ద్వారా తన విడుదల విషయాన్ని వెల్లడించారు. "నన్ను విడుదల చేశారు. ఇప్పుడు రఫీ అహ్మద్ కిద్వాయ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న నా సోదరుడిని విడిపించడానికి వెళ్తున్నాను. కావాలనే మమ్మల్ని నగరం లోని వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లారు. మేము ఏ తప్పూ చేయలేదని మళ్లీ చెప్తున్నాను" అని ఆయేషా పేర్కొన్నారు.

సినీ ప్రముఖుల మద్దతు..

విద్యార్థుల నిరసన హక్కులకు మద్దతుగా శబానా అజ్మీ, ప్రకాష్ రాజ్, అమోల్ పరాశర్, రత్నా పాఠక్ షా, సీమా పహ్వా, నసీరుద్దీన్ షా వంటి పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు.