ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె.. హైదరాబాద్‌‌‌‌లో నిలిచిన రవాణా సేవలు

ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్ల సమ్మె.. హైదరాబాద్‌‌‌‌లో నిలిచిన రవాణా సేవలు
  • ప్లాట్‌‌‌‌ఫామ్ కంపెనీలు.. కమీషన్లు తగ్గించి, బేస్ ఫేర్లు పెంచాలని డిమాండ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: యాప్ ఆధారిత సంస్థల దోపిడీని నిరసిస్తూ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌‌‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), టీఏడీఎఫ్ పిలుపు మేరకు ఓలా, ఉబర్, ర్యాపిడో, స్విగ్గి, జొమోటో, జెప్టో వర్కర్లు బుధవారం రాష్ట్రవ్యాప్త బ్రేక్ డౌన్ సమ్మె చేపట్టారు.

పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లకు అనుగుణంగా చార్జీలు పెంచకపోవడం, యాప్‌‌‌‌లు 25 నుంచి 30 శాతం వరకు హెవీ కమీషన్లు, ప్లాట్‌‌‌‌ఫామ్ ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ డ్రైవర్లు రోడ్లపైకి వచ్చారు. సమ్మెలో పాల్గొనని వాహనాలను అడ్డుకోవడం, ప్యాసింజర్లను మధ్యలోనే దింపేయడంతో జనం ఇబ్బందులు పడ్డారు.

అమీర్‌‌‌‌పేట్, సికింద్రాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, ఎల్‌‌‌‌బీనగర్, లక్డీకాపూల్, ఖైరతాబాద్‌‌‌‌లలో సేవలు నిలిచిపోగా, శంషాబాద్ ఎయిర్‌‌‌‌పోర్ట్ వద్ద పోలీసులు రంగంలోకి దిగారు. ప్రయాణికుల అవసరాన్ని అదనుగా తీసుకుని కొందరు ఆటో డ్రైవర్లు డబుల్ చార్జీలు వసూలు చేశారు.

ఈ సందర్భంగా టీజీపీడబ్ల్యూయూ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ గిగ్ వర్కర్ల కోసం స్పెషల్ రూల్స్, వెల్ఫేర్ బోర్డును తీసుకురావాలన్నారు. ప్రభుత్వం, కంపెనీలు స్పందించకపోతే ఆగస్టు 8 తర్వాత సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.

12 గంటలు కష్టపడినా గిట్టుబాటు కావట్లే..
ఫ్యూయల్ రేట్లు, ఈఎంఐలు, మెయింటెనెన్స్ ఖర్చులు పోను రోజుకు 12 గంటలు శ్రమించినా ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు.

ఐదేళ్లుగా చార్జీలు పెంచలేదని, కస్టమర్ దగ్గరకు ఫ్రీగా వెళ్లాల్సి రావడం, రైడ్ క్యాన్సిలేషన్ పెనాల్టీలు, అకౌంట్ల బ్లాకింగ్ అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌‌‌‌లైన్స్-2025 ప్రకారం బేస్ ఫేర్, కిలోమీటర్, నిమిషాల వారీగా ఛార్జీలను ప్రభుత్వం ప్రకటించాలని కోరారు.