ఉద్యోగాలు మానేసి వెళ్లిపోతాం.. ప్యాకేజీ ఎంతో చెప్పండి : 4 వేల 500 మంది గూగుల్ ఉద్యోగులు

ఉద్యోగాలు మానేసి వెళ్లిపోతాం.. ప్యాకేజీ ఎంతో చెప్పండి : 4 వేల 500 మంది గూగుల్ ఉద్యోగులు

ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత సురక్షితమైన ఉద్యోగాల్లో ఒకటిగా భావించిన టెక్ ఉద్యోగాలు ఇప్పుడు అనిశ్చితిలోకి వెళ్తున్నాయి. AI విస్తరణ, ఖర్చుల తగ్గింపు చర్యలతో దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో గూగుల్ ఉద్యోగులు తమ భవిష్యత్ భద్రత కోసం నేరుగా కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్‌ను ఆశ్రయించారు. ఉద్యోగాల కోత సమయంలో మెరుగైన రక్షణ కల్పించాలని కోరుతూ 4వేల 500 మందికి పైగా ఉద్యోగులు సంతకాలతో పిటిషన్ సమర్పించారు.

ఎగ్జిట్ ప్యాకేజీలకు ఉద్యోగుల డిమాండ్..
గూగుల్ ఉద్యోగులు తమ పిటిషన్‌లో ప్రధానంగా మెరుగైన సెవరెన్స్ ప్యాకేజీ, వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీలు, ఉద్యోగాల తొలగింపు ప్రక్రియలో స్పష్టత వంటి అంశాలను డిమాండ్ చేశారు. కంపెనీ ఉద్యోగులను తొలగించే ముందు స్వచ్ఛందంగా బయటకు వెళ్లే అవకాశాలు కల్పించాలని కోరారు. లేఆఫ్ కి గురయ్యే సిబ్బందికి ఎక్కువ కాలం వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని, పనితీరు ఆధారిత ఒత్తిడి విధానాలను తగ్గించాలని ఉద్యోగులు కోరుతున్నారు.

AI పెట్టుబడులపై పెరుగుతున్న ఆందోళన..
గూగుల్ ప్రస్తుతం AI రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. జెమిని ఏఐ అభివృద్ధి, కొత్త సాంకేతికతలపై దృష్టి పెరగడంతో కంపెనీలోని కొన్ని డిపార్ట్మెంట్లలో ఉద్యోగాల పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది. ఈ మార్పుల వల్ల భవిష్యత్‌లో మరిన్ని లేఆఫ్స్ ఉండొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో పెరిగింది.

పిచాయ్‌కు పిటిషన్.. క్యాంపస్ బయట నిరసన
ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ పిటిషన్‌ను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో పాటు 3 సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు అందించారు. దాదాపు 100 మంది ఉద్యోగులు గూగుల్ క్యాంపస్ బయట సమావేశమై తమ డిమాండ్లకు మద్దతు తెలిపారు. నిరసనలో పాల్గొన్న ఉద్యోగులు నల్లటి టీషర్టులు ధరించి, పిటిషన్‌పై సంతకం చేసిన వారి పేర్లతో బ్యానర్లు ప్రదర్శించారు. కంపెనీ ఆర్థికంగా బలమైన స్థితిలో ఉన్నప్పటికీ ఉద్యోగాల కోతలను కొనసాగించడం సరైన విధానం కాదని గూగుల్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు విమర్శించారు. కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు మరింత రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

గూగుల్‌లో ఇది కొత్త నిరసన కాదు..
గతంలో కూడా గూగుల్ ఉద్యోగులు కంపెనీ సైనిక ఒప్పందాలు, వర్క్ కల్చర్, ఉద్యోగుల పట్ల వ్యవహారశైలి, AI వినియోగంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే తాజా నిరసన పూర్తిగా ఉద్యోగ భద్రత, లేఆఫ్‌ల సమయంలో న్యాయమైన విధానాల కోసం జరుగుతోంది. మెుత్తానికి AI మార్పులతో టెక్ రంగంలో ఉద్యోగాల స్వరూపం వేగంగా మారుతున్న సమయంలో.. గూగుల్ ఉద్యోగుల డిమాండ్లు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. భవిష్యత్‌లో కంపెనీలు కేవలం సాంకేతిక అభివృద్ధిపైనే కాకుండా ఉద్యోగుల భద్రత, పారదర్శక లేఆఫ్ విధానాలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ పరిణామం సూచిస్తోంది.