హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు రోడ్డెక్కారు. 11 రూపాయలు ఉన్న రేట్ కార్డ్ను 20 రూపాయలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు దాదాపుగా నిలిచిపోయాయి. మేడిపల్లి దగ్గర ఆటో యూనియన్ కార్మికులు ఆటోలను ఆపి సమ్మెలో భాగంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓలా, ర్యాపిడో, ఉబర్ సంస్థలు ప్రారంభమైన సమయంలో కిలోమీటర్‌కు రూ.20 వరకు చెల్లించేవారని, ప్రస్తుతం కిలోమీటర్‌కు సుమారు రూ.11 వరకు రేట్లు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు.
యాప్ ఆధారిత సంస్థలు, ఉచిత బస్సు ప్రయాణం కారణంగా తమ కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు తెలిపారు. రేటు కార్డు పెంచాలని డిమాండ్ చేస్తూ గత వారం నుంచి అన్ని యూనియన్లు, కమిటీలతో చర్చలు జరిపామని చెప్పారు. రేటు కార్డు పెంపు డిమాండ్‌తో ఇవాళ (జులై 22, 2026) సమ్మెకు పిలుపునిచ్చినట్లు డ్రైవర్లు తెలిపారు. కొందరు డ్రైవర్లు విధులకు వెళ్లినప్పటికీ, తమ సమ్మెకు సహకరిస్తున్నారని చెప్పారు. ప్రయాణికులు కూడా తమకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం, యాప్ ఆధారిత క్యాబ్ సంస్థలు స్పందించి రేట్లు పెంచాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు బంద్ పాటించాలని నిర్ణయించారు.
