AI డిపార్ట్మెంట్లో ఉద్యోగులను పీకేసిన అమెజాన్.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?

AI డిపార్ట్మెంట్లో ఉద్యోగులను పీకేసిన అమెజాన్.. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?

ఏఐ రంగంలో పోటీ రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న వేళ అమెజాన్ మరోసారి లేఆఫ్స్ చేపట్టింది. ఈసారి కంపెనీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగులను తొలగించింది. ఎంతమందిని పీకేసిందనే వివరాలు బయటకు రానప్పటికీ.. అత్యంత ప్రాధాన్యమున్న ఏఐ ప్రాజెక్టులపై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. దీంతో ప్రపంచ టెక్ రంగంలో మరోసారి అమెజాన్ లేఆఫ్స్ హాట్ టాపిక్‌గా మారాయి.

AIకే ప్రాధాన్యం.. కానీ అన్ని టీమ్‌లకు కాదు
అమెజానా చాలా ఏళ్లుగా భారీ ఏఐ మోడళ్ల అభివృద్ధిపై పని చేస్తోంది. అయితే కస్టమర్లకు ఎక్కువ ఉపయోగపడే ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలంటే వనరులను పునర్వ్యవస్థీకరించడం తప్పనిసరి అయిందని తెలిపింది. అందుకే AGI డిపార్ట్మెంట్లో కొన్ని టీమ్‌లలో ఉద్యోగాలను తొలగించినట్లు వెల్లడించింది. ఇది AIపై వెనక్కి తగ్గడం కాదని.. మరింత వ్యూహాత్మకంగా ముందుకు సాగడమే లక్ష్యమని కంపెనీ చెబుతోంది. దీంతో తొలిసారిగా ఏఐ కోసం పనిచేస్తున్న ఉద్యోగులపై కూడా వేటు పడినట్లు అయ్యింది. 

ఈ ఏడాది జనవరిలోనే అమెజాన్ సుమారు 16 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించింది. ఖర్చులను తగ్గించడం, అనవసరమైన బ్యూరోక్రసీని తగ్గించడం, నిర్ణయాలను వేగంగా అమలు చేయడం కోసం అప్పట్లో ఆ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అదే వ్యూహంలో భాగంగా AI విభాగంలోనూ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది.

AIలో భారీ పెట్టుబడులు.. తగ్గని దూకుడు
ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నప్పటికీ AI రంగంలో అమెజాన్ పెట్టుబడులు మాత్రం తగ్గడం లేదు. రిటైల్, క్లౌడ్, డివైసెస్ వ్యాపారాల్లో జనరేటివ్ AIను విస్తృతంగా వినియోగిస్తోంది. AWS ద్వారా డేటా సెంటర్లు, AI చిప్స్, ఫౌండేషన్ మోడళ్ల అభివృద్ధికి కంపెనీ బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తోంది. సీఈఓ ఆండీ జాస్సీ జనరేటివ్ AIను "తరానికి ఒకసారి వచ్చే సాంకేతిక విప్లవం"గా అభివర్ణిస్తూ ఈ రంగంలో దూకుడు కొనసాగిస్తున్నారు.

ALSO READ : ఉద్యోగాలు మానేసి వెళ్లిపోతాం.. ప్యాకేజీ ఎంతో చెప్పండి

ఇటీవల అమెజాన్ Nova పేరుతో ఫౌండేషన్ AI మోడళ్లను ప్రవేశపెట్టింది. ఇవి Amazon Bedrock ద్వారా ఎంటర్‌ప్రైజ్ వినియోగదారులకు తక్కువ ఖర్చుతో ఏఐ సేవలు అందించేలా రూపొందించబడ్డాయి. మరోవైపు ఏఐ స్టార్టప్ Anthropicలో బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టి, దాని క్లాడ్ మోడళ్లను కూడా Bedrockలో అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే వినియోగదారులు అమెజాన్ నోవా లేదంటే ఆంత్రోపిక్ క్లాడ్ మోడళ్లలో తమ అవసరానికి అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగాల కోతలు ఒకవైపు కొనసాగుతున్నా.. AI రంగంలో అగ్రస్థానాన్ని దక్కించుకోవడమే అమెజాన్ అసలు లక్ష్యమని తాజా నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి.