- ప్రతిఘటించిన ఉద్యోగిని.. నిందితుడి అరెస్ట్, రిమాండ్
శంషాబాద్, వెలుగు: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ క్యాబిన్ క్రూ ఉద్యోగినిపై ఓ క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. ఈ నెల 20న రాత్రి సదరు ఉద్యోగిని డ్యూటీకి వెళ్లేందుకు రోజూ వచ్చే క్యాబ్‌లోనే బయలుదేరింది. మార్గమధ్యలో డ్రైవర్ ఎర్రపోగు ప్రశాంత్ కుమార్ (23) కారును ఎయిర్‌పోర్టు వైపు తీసుకెళ్లకుండా 'సాంక్టామారియా' స్కూల్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి మళ్లించాడు.
టాయిలెట్‌కి వెళ్తానని చెప్పి కారు పక్కన నిలిపాడు. అనంతరం వెనుక సీట్లోకి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. సదరు ఉద్యోగిని గట్టిగా ప్రతిఘటించింది. ఆమె కేకలు వేయడంతో దొరికిపోతాననే భయంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. కాసేపటికి తేరుకున్న ఆమె వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టు అవుట్ పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఎయిర్‌పోర్టు రోడ్లు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు.
క్యాబ్ నంబర్, బుకింగ్ వివరాలు, డ్రైవర్ కాల్ డేటా ఆధారంగా బుధవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వనపర్తి జిల్లాకు చెందిన వ్యక్తి అని, ప్రస్తుతం శంషాబాద్ మండలంలోని సిద్ధాంతి ప్రాంతంలో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
