- తొలి క్వార్టర్‌లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి కంప్ర్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) 2026-–27 ఆర్థిక సంవత్సరం జూన్ నెలాఖరు వరకు నమోదైన లెక్కలను వెల్లడించింది. వార్షిక బడ్జెట్ అంచనా రూ. 2,41,263 కోట్లలో తొలి మూడు నెలల్లో రూ. 42,525 కోట్లు రెవెన్యూ రాబడిగా వచ్చింది.
ఇందులో పన్నుల ద్వారా రూ.38,447 కోట్లు సమకూరగా, జీఎస్టీ రూపంలో అత్యధికంగా రూ. 13,988 కోట్లు, సేల్స్ ట్యాక్స్ నుంచి రూ. 9,251 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల నుంచి రూ. 4,510 కోట్లు, ఎక్సైజ్ శాఖతో రూ. 5,044 కోట్లు ఇన్ కం వచ్చింది. పన్నుల వసూళ్లు నిలకడగానే ఉన్నప్పటికీ పన్నేతర రాబడి బడ్జెట్ లక్ష్యంలో కేవలం రూ. 2,697 కోట్లు, కేంద్ర గ్రాంట్లు రూ. 1380 కోట్లు మాత్రమే రావడం ఆదాయ వృద్ధికి అడ్డంకిగా మారింది. మరోవైపు ఆదాయానికి అనుగుణంగా వ్యయాలు పెరుగుతుండటంతో రాష్ట్ర ఆర్థిక స్థితిపై లోటు భారం పెరుగుతోంది.
మొదటి మూడు నెలల్లో ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ. 61,394 కోట్లుగా నమోదు కాగా, ఇందులో సింహభాగం రెవెన్యూ వ్యయానికే రూ. 54,815 కోట్లు అయింది. ఉద్యోగుల జీతాల కోసం రూ. 13,063 కోట్లు, పెన్షన్లకు రూ. 7,309 కోట్లు, పాత అప్పుల వడ్డీలకు రూ. 7,778 కోట్లు, సబ్సిడీలకు రూ. 6,956 కోట్లు ఖర్చయ్యాయి.
అభివృద్ధికి ఉద్దేశించిన మూలధన వ్యయం రూ. 6,579 కోట్లకు మాత్రమే పరిమితమవగా, జూన్ నాటికి రెవెన్యూ లోటు రూ. 12,289 కోట్లకు చేరింది. ఈ అవసరాల నిమిత్తం ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్దేశించుకున్న రూ.58,458 కోట్ల వార్షిక రుణ లక్ష్యంలో జూన్ నెలాఖరుకే రూ. 21,919 కోట్ల అప్పులను సమకూర్చుకోవడం గమనార్హం.
