ఆధ్యాత్మికం: జులై 25న ఉపవాసం ఎందుకు ఉండాలి.. ఆరోజు విశిష్టత ప్రాధాన్యత ఇదే..!

ఆధ్యాత్మికం:  జులై 25న ఉపవాసం ఎందుకు ఉండాలి.. ఆరోజు విశిష్టత  ప్రాధాన్యత ఇదే..!

తెలుగు పంచాగం ప్రకారం ఈ ఏడాది (2026) జులై 25 న చాలా పవిత్రమైన రోజని పండితులు చెబుతున్నారు.  ఆరోజు ఆషాఢమాసం.. శుక్లపక్షం ఏకాదశి తిథి.. ఏడాదిలో  24 ఏకాద‌శులు వ‌స్తాయి. ఆషాఢమాసం శుక్ల పక్షంలో వ‌చ్చే ఏకాద‌శిని తొలి ఏకాద‌శిగా పిలుస్తారు. శ‌య‌నైక ఏకాద‌శి, హరి వాస‌ర‌మ‌ని, పేలాల పండుగ‌గా కూడా పిలుస్తారు. ఈ పండును తొలి పండుగ‌గా జ‌రుపుకోవ‌డం ఆచారం.సాధారణంగా వ్రతం అంటే ఖర్చుతో కూడుకున్నది అనే భావన ఉంటుంది. కానీ ఏకాదశి వ్రతానికి ఎటువంటి ఖర్చు ఉండదు. పైగా ఖర్చును తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. తొలి ఏకాదశి రోజు ఎందుకు ఉపవాపం ఉండాలి.. ఆ రోజు ప్రాముఖ్యత.. విశిష్టత గురించి తెలుసుకుందాం. . .!

భారతీయ సంప్రదాయంలో తొలి పండుగగా పిలువబడే తొలి ఏకాదశికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో రెండోది బహుళ (కృష్ణ)పక్షంలో వస్తాయి. ఇక ప్రతి ఒక్క హిందువు తప్పనిసరిగా ఆచరించాల్సిన వ్రతాలల్లో ఏకాదశి వ్రతం అత్యంత కీర్తిగాంచింది. చాలా పవిత్రమైంది. 

హిందూ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసంలోని తొలి ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి తిథి జూలై 25వ తేదీ శనివారం జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. 

  • తొలి ఏకాదశి తిథి ప్రారంభం :  జులై 24 శుక్రవారం ఉదయం 10:08 గంటలకు 
  • తొలిశయని ఏకాదశి తిథి ముగింపు :  జులై 25  శనివారం ఉదయం 11:54 గంటలకు 
  • బ్రహ్మ ముహుర్తం: ఉదయం 4:16 గంటల నుంచి ఉదయం 4:57 గంటల వరకు
  • అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:00 గంటలనుంచి మధ్యాహ్నం 12:55 గంటల వరకు
  • పూజా ముహుర్తం : ఉదయం 7:21 గంటల నుంచి ఉదయం 9:03 గంటల వరకు
  • సంధ్యా కాల సమయం: రాత్రి 7:17 గంటల నుంచి రాత్రి 8:19 గంటల వరకు
  • ఉపవాస విరమణ :జూలై 26న తెల్లవారుజామున 5:38 గంటల నుంచి ఉదయం 8:22 గంటల వరకు

ఉదయం తిథి ప్రకారం జులై 25వ తేదీన శనివారం నాడు తొలి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజు శ్రీ విష్ణుమూర్తికి అంకితమివ్వబడింది. ఈ పర్వదినాన ఉపవాస దీక్షను కూడా చేస్తారు. ఈ సమయంలో శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి,  నియమ నిష్ఠలతో విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల శ్రీ హరి  అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు,  సిరి సంపదలు కలుగుతాయి.

ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా  పిలుస్తారు. దీనికే శయనైకాదశి అని హరి వాసరమని, పేలాల పండుగ అని పేరు. పురాణాలను అనుసరించి శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడు.. అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని.. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు.

చాతుర్మాస్య దీక్ష ప్రారంభం

ఆషాఢం నుంచి నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. అంటే ఆషాఢం, శ్రావణం, బాధ్రపదం, ఆశ్వయుజమాసం ఈ నాలుగునెలలు చాలా పవిత్రమైనవి. తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉంటాడని పురాణగాథ. 

ఉత్తరాయణం కంటే దక్షిణాయణంలో పండుగలు... పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి.. ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి.. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. ముఖ్యంగా వర్షకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వ్రతం పేరిట అనేక కట్టుబాట్లను మనకు పెద్దలు ఏర్పాటుచేశారు.

ఏకాదశినాడు ఎందుకు ఉపవాసం ఉండాలి

పూర్వం కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించడంతో శ్రీ మహా విష్ణువు అతనితో వెయ్యేళ్లు పోరాడి.. అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి..రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజించబడాలని కోరుకుందట.. అప్పటి నుంచి ఆమె ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది.. నాటి నుంచి సాధువులు, భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు.

ఏకాదశి వ్రతం ఎలా చేయాలి?

 ఏకాదశికి ముందు రోజు అంటే దశమిరోజు రాత్రి పూట భోజనం చేయకూడదు. ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఉన్నవారు, ఉద్యోగులు, శ్రామికులు, పిల్లలు, పెద్దలు తేలికపాటి అల్పాహారాన్ని, పండ్లుపాలు తీసుకోవాలి. మరుసటి రోజు అంటే ఏకాదశిరోజు ప్రాతఃకాలం అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం, దైవారాధన, దీపారాధన చేసుకుని తమతమ కార్యాక్రమాలు యథావిధిగా చేసుకోవాలి. మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఎటువంటి ఆహారాన్ని తీసుకోవద్దు. అయితే పైన పేర్కొన్న వారు మాత్రం తేలికపాటి అల్పాహారాన్ని మితంగా తీసుకోవాలి. ఉదయం పూట అవకాశం ఉన్నవారు దేవాలయాల సందర్శన, పూజలు, స్తోత్ర పారాయణాలు చేయాలి. వీలైతే తప్పక గోపూజ చేయండి.

ALSO READ : ఆరోగ్యం..ఆధ్యాత్మికం: పేలాలపిండి తొలి ఏకాదశి ప్రసాదం..ఎందుకు తినాలి.. ఎలా తయారుచేయాలి.

ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి. వీలుకాకుంటే నిద్రపోయే వరకు విష్ణునామస్మరణ చేసుకోండి. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి పారణ చేయాలి. అంటే ప్రాతఃకాలంలోనే లేచి యధావిధిగా నిత్యకాలకృత్యాలు, దేవతారాధన చేసుకుని వెంటనే శుచితో చేసిన మహానైవేద్యాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి వెంటనే అతిథి ఉంటే వారికి భోజనం పెట్టి మీరు భోజనం చేయాలి. అతిథి లేకుంటే కొంత అన్నాన్ని బలిభుక్కుల కింద కనిపించే, కనిపించని జీవరాశికి ఇంటిబయట ఒక ముద్ద పెట్టి వచ్చి భోజనాన్ని చేయాలి.

 తొలి ఏకాదశి  శివుడికి, అమ్మవారికి, వేంకటేశ్వరస్వామికి చాలా ప్రీతికరం. ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి.. కనుక ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే.. శివకేశవులతోపాటు అమ్మ అనుగ్రహం లభిస్తుంది.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.