ఢిల్లీలో బాయ్స్ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి.. రంగంలోకి అమిత్ షా

ఢిల్లీలో బాయ్స్ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి.. రంగంలోకి అమిత్ షా

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో హాస్టల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటివరకు తొమ్మిది మందిని రక్షించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోగా రెస్య్కూ టీమ్స్ యుద్ధప్రాతిపదికన సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భవన శిథిలాల కింద మరో 15 మంది విద్యార్థులు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ దుర్ఘటనపై ఢిల్లీ సీఎం రేఖా గుప్తాతో ఫోన్‎లో మాట్లాడారు. 

ప్రమాదానికి గల కారణాలు, సహయక చర్యలపై ఆయన ఆరా తీశారు. క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేయడానికి ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్‌డీఆర్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్‌తో కూడా అమిత్ షా మాట్లాడారు. స్థానిక యంత్రాంగం, ఎన్‌డీఆర్‌ఎఫ్ సమన్వయంతో ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతున్నాయని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

ఘటన స్థలానికి సీఎం రేఖా గుప్తా:

సత్య నికేతన్ ప్రాంతంలో హాస్టల్ భవనం కుప్పకూలిన ఘటన స్థలాన్ని అధికారులతో కలిసి సీఎం రేఖా గుప్తా పరిశీలించారు. ఘటన స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలను ఆమె పర్యవేక్షించారు. ఘటన స్థలంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కూలిపోయిన భవనం పాతదని, అందులో కొన్ని నిర్మాణ, పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. బేస్‌మెంట్‌లో తవ్వకాలు జరుగుతుండగా, ఒక స్తంభం పక్కకు జరగడంతో భవనం మొత్తం కూలిపోయిందని తెలిపారు. 

►ALSO READ | KFC చికెన్ మీ ఫేవరెటా..? ఓసారి ఇది చూడండి.. ఆ తర్వాత..!

కుప్పకూలిన భవనంలో బాయ్స్ పీజీగా నిర్వహిస్తు్న్నారని.. ప్రమాద సమయంలో భవనం లోపల పిల్లలు ఉన్నారని చెప్పారు. ఘటన స్థలంలో రెస్య్కూ టీమ్స్ ముమ్మురంగా సహయక చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. పిల్లల ప్రాణాలను కాపాడటమే మా తొలి ప్రాధాన్యతని పేర్కొన్నారు. అధికారులంతా ఘటన స్థలంలోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. దోషులను మాత్రం వదిలిపెట్టబోమని.. చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.