వారం క్రితమే పెళ్లైంది.. సినిమాకు వెళ్దామని చెప్పి నిమ్మతోటలోకి తీసుకెళ్లి గొంతు కోశాడు !

వారం క్రితమే పెళ్లైంది.. సినిమాకు వెళ్దామని చెప్పి నిమ్మతోటలోకి తీసుకెళ్లి గొంతు కోశాడు !

నెల్లూరు: నవ వధువుపై కట్టుకున్న భర్తనే హత్యాయత్నానికి ఒడిగట్టిన అమానుష ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో వెలుగుచూసింది. పెళ్లయిన వారానికే భార్యను హతమార్చేందుకు ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారమే సినిమాకు తీసుకెళ్తానని చెప్పి.. మధ్యలోనే ఆమెను అంతం చేసేందుకు ప్రయత్నించాడు.

నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలం పందిపాడులో ఈ ఘటన జరిగింది. నిందితుడిని నెల్లూరు వి.నగర్కు చెందిన హేమసాయిగా పోలీసులు గుర్తించారు. బద్ధకూరి మహాలక్ష్మికి అనే యువతితో హేమసాయికి వారం క్రితమే పెళ్లి జరిగింది.

హేమ సాయికి సినిమాకు వెళ్దామని భార్యకు చెప్పాడు. ఇద్దరూ కలిసి స్కూటీపై ఆత్మకూరుకి వెళుతున్నారు. అయితే.. దారి మధ్యలో ఉన్నట్టుండి ఒక నిమ్మ తోట దగ్గరలో స్కూటీ ఆపిన హేమసాయి.. సర్ ప్రైజ్ ఉందని మహాలక్ష్మిని నిమ్మతోటలోకి తీసుకెళ్లాడు. భర్త మాటలను నమ్మి ఆమె నిమ్మతోటలోకి వెళ్లింది. 

భార్యను నిమ్మ తోటలోకి తీసుకెళ్లాక మాట్లాడుతూనే వెంట తెచ్చుకున్న బ్లేడ్తో గొంతు కోశాడు. భర్త చేసిన పనికి విస్తుపోయిన మహాలక్ష్మి గొంతు నుంచి రక్తం కారుతున్న స్థితిలోనే రోడ్డు పైకి పరిగెత్తుకుంటూ వెళ్లి రోడ్డుపై పడిపోయింది. రోడ్డుపై వెళుతున్న స్థానికులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

నెల్లూరు ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఏం జరిగిందని పోలీసులు హేమ సాయిని అడగ్గా.. గుర్తు తెలియని దుండగులు తమ స్కూటీని అడ్డగించి తన భార్యపై దాడి చేశారని చెప్పాడు. పోలీసులకు హేమసాయిపై అనుమానమొచ్చి తమదైన శైలిలో విచారణ చేయగా ఆమెను చంపేందుకు యత్నించినట్లు నిజం ఒప్పుకున్నాడు. ఆత్మకూరు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.