భార్యాభర్తలు కలిసి రూ.6 లక్షలు గోల్డ్ లోన్ తీసుకున్నారు. లోన్ తిరిగి చెల్లించకుండా తప్పించుకునేందుకు ఏకంగా ఫైనాన్స్ సంస్థ మేనేజర్ ని చంపేశారు. గుజరాత్ లో జరిగింది ఈ దారుణం. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... గుజరాత్ లోని ప్రాంతిజ్ లో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సంస్థ మాన్సా బ్రాంచ్ లో భావన అలియాస్ భావు ఠాకూర్, ఆమె ప్రియుడు యోగేష్ ఠాకూర్ ఇద్దరు కలిసి గోల్డ్ లోన్ తీసుకున్నారు. ఈఎంఐలు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో సంస్థ మేనేజర్ నే హతమార్చారు.
భరత్ చౌదరి అదృశ్యమయ్యాడని సెప్టెంబర్ 2న కేసు నమోదు కాగా... అతని మృతదేహం రెండు రోజుల క్రితం ప్రాంతిజ్ తాలూకాలోని లిమ్లా గ్రామం సమీపంలో అతని కారులో లభ్యమైంది. భరత్ కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసిన ప్రాంతిజ్ పోలీసులు కొన్ని గంటల్లోనే కేసును ఛేదించారు. భావు ఠాకూర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పరారీలో ఉన్న యోగేష్ కోసం గాలిస్తున్నారు.
భావన ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రూ. 1.50 లక్షలు రుణం తీసుకోగా, యోగేష్ రూ.4.50 లక్షలు తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి 6 లక్షలు బాకీ ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది.కొంతకాలంగా ఈఎంఐలు చెల్లించకుండా తప్పించుకుంటూ వస్తున్న నిందితులు తాకట్టులో ఉన్న బంగారాన్ని తిరిగి పొందేందుకు బ్రాంచ్ మేనేజర్ ను చంపాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
►ALSO READ | ఢిల్లీలో బాయ్స్ హాస్టల్ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి.. రంగంలోకి అమిత్ షా
డబ్బు ఇస్తానని చెప్పి భరత్ కి కాల్ చేసి ప్రాంతిజ్ కు రప్పించి హత్యకు ప్లాన్ చేసినట్లు తెలిపారు పోలీసులు. యోగేష్ తన కారులో భరత్ ను మాన్సా నుండి ప్రాంతిజ్ కు తీసుకెళ్లాడని.. ఆ తర్వాత కారులోనే భరత్ ను కత్తితో పొడిచి చంపేశారని తెలిపారు. హత్య తర్వాత, భరత్ మృతదేహాన్ని, కారును ఒక నిర్మానుష్య ప్రదేశంలో పడేసి వెళ్లిపోవాలని ప్లాన్ చేశారని... ఈ క్రమంలో లిమ్లా వైపు వెళ్లేందుకు కారును వెనక్కి తిప్పుతుండగా అది రోడ్డు పక్కన ఉన్న గుంతలో ఇరుక్కుపోయిందని... దీంతో పట్టుబడతామనే భయంతో, ఆ ఇద్దరూ కారును, భరత్ మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారని తెలిపారు పోలీసులు.
లిమ్లా గ్రామం నుంచి వద్వాస వైపు వెళ్లే రహదారిపై కారులో భరత్ మృతదేహం లభించిందని తెలిపారు పోలీసులు. అతని మెడపై పదునైన ఆయుధంతో చేసిన గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
