హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సు హత్యాచారానికి గురైన ఘటనను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధితురాలు ఉంటున్న వసతి ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు, సంబంధిత సంస్థ నిర్వహణలో ఏమైనా నిర్లక్ష్యాలు ఉన్నాయా, మహిళా ఉద్యోగుల భద్రతకు సంబంధించి పాటించాల్సిన నిబంధనలు అమలయ్యాయా అన్న అంశాలన్నింటినీ విచారణలో పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు.
ఈ కేసులో నిందితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో దర్యాప్తును అత్యంత పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. దర్యాప్తు, ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర సాంకేతిక ఆధారాల సేకరణను వీలైనంత వేగంగా పూర్తి చేసి సమగ్ర ఛార్జ్‌షీట్ దాఖలు చేసేలా పోలీసు ఉన్నతాధికారులు కేసును నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు.
ఈ కేసులో బాధిత కుటుంబానికి సత్వర న్యాయం అందేలా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేపట్టేందుకు అవసరమైన చర్యలను ప్రారంభించాలని ఆదేశించారు. న్యాయశాఖ, పోలీసు శాఖ, ప్రాసిక్యూషన్ విభాగాలు సమన్వయంతో పనిచేసి కేసు విచారణలో జాప్యం జరక్కుండా చూడాలని సూచించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వం తరఫున మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. ఘటనకు కారణమైన వ్యవస్థాపరమైన లోపాలను గుర్తించి సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా కేసు విచారణ పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..?
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రైమ్ కేర్ దవాఖాన షెల్టర్ రూమ్లో ఓనర్సును ఓ కిరాతకుడు అత్యంత పాశవికంగా చంపేశాడు. హాస్పిటల్ రూమ్లో స్నేహితురాలితో కలిసి ఉంటున్న యువతి అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న సమయం చూసి రూమ్లోకి ప్రవేశించాడు. ఆమె ప్రతిఘటించడంతో రాడ్తో ముఖంపై చితకబాదాడు. ఆ తర్వాత లైంగికదాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా.. పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
►ALSO READ | బాచుపల్లిలో కారుకు నిప్పంటించిన రియల్టర్ అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన ఓ యువతి(21) ఏడు నెలలుగా తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ దవాఖానలో నర్సుగా పని చేస్తోంది. ఆ హాస్పిటలిబిల్డింగ్ కింది రూమ్లోనే ఓ బైక్మెకానిక్ షాపు ఉంది. దాని పక్క సందు నుంచే నర్సులకు కేటాయించిన రూమ్లకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, శనివారం మధ్యాహ్నం ఆమె డ్యూటీకి రాకపోవడంతో తోటి సిబ్బంది గదికి వెళ్లి తలుపులు కొట్టారు. లోపల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కిటికీలోంచి చూడగా ముఖంపై తీవ్ర గాయాలతో, రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉంది.
దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పహడీషరీఫో పోలీసులు డాగ్, క్లూస్ టీమ్తో వచ్చి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. పంక్చర్ లివర్తో ముఖంపై బలంగా కొట్టి హతమార్చినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాళ్లపై కూడా తీవ్ర గాయాలున్నాయి. బాధితురాలి దుస్తులు, శరీరంపై ఉన్న గాయాలను బట్టి లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డెడ్బాడీని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
కిటికీ ద్వారా లోపలికి ప్రవేశించి..
బిహార్ లోని బేగుసరాయ్ జిల్లా బచ్వారా మండలం రుదౌలి గ్రామానికి చెందిన మహ్మద్ సదావుల్లా(34) తుక్కుగూడ వద్ద ప్రైమ్ కేర్ హాస్పిటల్ ఆవరణలోని షాపులో బైక్ మెకానిక్గా పని చేస్తున్నాడు. హాస్టల్పక్కనే షాపు ఉండడంతో కొద్ది రోజులుగా యువతి వచ్చే టైం, వెళ్లే టైం గమనిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి ఆమె తన రూమ్లో ఒంటరిగా ఉందని, పక్కన రూముల్లో కూడా ఎవరూ లేరని తెలుసుకున్నాడు. తర్వాత కిటికీ ద్వారా ఆమె రూమ్లోకి ప్రవేశించాడు.
అలికిడి విన్న ఆమె కళ్లు తెరిచి చూసే సరికి ఎవరో లోపలకు రావడం కనిపించింది. దీంతో అరవబోయింది. వెంటనే ఆమె నోరు మూసిన నిందితుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో రాడ్తో ఆమె ముఖంపై చితకబాదాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో లైంగికదాడి చేశాడు. తర్వాత గొంతు నులిమి చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
వీడియో కాల్ మాట్లాడిన గంటల్లోనే
యువతి తండ్రి చనిపోవడంతో తల్లి కూలి పనులు చేసుకుంటూ ఆమెతో పాటు మరో కొడుకును పోషిస్తోంది. ఘటన జరిగిన రోజు రాత్రి 10.30 గంటల వరకు కుటుంబసభ్యులతో అమె వీడియో కాల్లో మాట్లాడింది. తాను బాగానే ఉన్నానని, తల్లి, సోదరుడు ఎలా ఉన్నారని కుశల ప్రశ్నలు వేసింది. శనివారం తనకు మధ్యాహ్నం డ్యూటీ ఉందని చెప్పింది. ఇక నిద్ర వస్తోందని పడుకుంటానని ఫోన్పెట్టేసింది. ఆమె పడుకున్న కొద్ది గంటల్లోనే నిందితుడు ఆమె రూమ్లోకి ప్రవేశించి లైంగికదాడి చేసి ప్రాణాలు తీశాడు.
