రూ. 4 లక్షల పెట్టుబడి.. రూ. 450 కోట్ల లాభం.. జాక్ పాక్ కొట్టిన'జంపింగ్ జాక్' !

రూ. 4 లక్షల పెట్టుబడి.. రూ. 450 కోట్ల లాభం.. జాక్ పాక్ కొట్టిన'జంపింగ్ జాక్' !

ఎనర్జిటిక్ డ్యాన్సులు, అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న బాలీవుడ్ లెజెండరీ హీరో జితేంద్ర. దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించి 'జంపింగ్ జాక్'గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఈ సూపర్ స్టార్ కేవలం సినిమాల్లోనే కాదు... రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోనూ అసలైన కింగ్‌ అనిపించుకున్నారు. లేటెస్ట్ గాఆయన చెప్పిన ఓ రియల్ ఎస్టేట్ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఒకప్పుడు ముంబై చాల్‌లోని 8 మంది కుటుంబ సభ్యులతో కలిసి  ఒక చిన్న గదిలో జీవించిన జితేంద్ర నేడు  బిలియనీర్‌గా ఎదిగారు. తన జీవితంలో చేసిన అత్యుత్తమ పెట్టుబడి గురించి వెల్లడించారు. ఒకప్పుడు'బైజూ బావ్రా' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ సంపాదించిన దిగ్గజ నటుడు భారత్ భూషణ్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. దీంతో ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన పాలి హిల్లో ఉన్న తన బంగ్లాను కేవలం రూ.4.25 లక్షలకు అమ్మకానికి పెట్టారని తెలిపారు.

ఆ సమయంలో తాను తండ్రితో మాట్లాడి ఆ బంగ్లాను కొనుగోలు చేశానని జితేంద్ర గుర్తు చేసుకున్నారు. ఆ ఇంటితో పాటు సుమారు 3,450 చదరపు అడుగుల స్థలం కూడా అదే ధరకు రావడం తన అదృష్టమని చెప్పారు.  ప్రస్తుతం అదే స్థలం మార్కెట్ విలువ దాదాపు రూ.450 కోట్లు ఉండొచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కేవలం రూ. 4.25 లక్షల పెట్టుబడి ఇప్పుడు వందల కోట్ల లాభం తో నిజంగా రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఇదొక ఊహించని క్రేజీ జాక్ పాట్ గా నిలుస్తోంది.

అయితే ఆ ఇంట్లోకి వెళ్లిన వెంటనే తన వరుసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ కావడంతో..  భారత్ భూషణ్‌లా తనకూ ఆర్థిక ఇబ్బందులు వస్తాయేమోనని భయపడి ఆ ఇంటిని వదిలేయాలని కూడా అనుకున్నానని జితేంద్ర వెల్లడించారు. కానీ కాలమే అన్నింటినీ మార్చేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ స్థలం రీడెవలప్‌మెంట్‌కు వెళ్లగా, ఇంటి నిర్మాణంలో ఉపయోగించిన బర్మా టెక్ కలప అమ్మకం ద్వారానే తనకు రూ.11.5 లక్షలు వచ్చాయని చెప్పారు.  తాను మొత్తం బంగ్లాను కొన్న ధర కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ మొత్తం కేవలం కలప ద్వారానే లభించిందని తెలిపారు.