ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మెప్పించిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు హాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. అయితే కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో ఆమె బాలీవుడ్‌ను ఎందుకు వదిలేశారు అనే ప్రశ్న అభిమానులను వెంటాడుతుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇందుకు గల కారణాలను ఆమె వెల్లడించింది. ఈ విషయం గురించి తాను ఎక్కువ మాట్లాడలేను అని అంటూనే తాను బాలీవుడ్‌ను వదలివెళ్లడానికి కొందరు స్టార్ హీరోలు కారణమని ఆమె చెప్పింది.
‘‘నేను కొందరిని మెప్పించనందుకు లేదా నాకు ఆ అలవాటు లేనందుకు కొందరు నా నుండి సినిమాలను లాగేసుకున్నారు. ఇతరులు రాజీపడినట్టుగా నేను వాళ్లకు అనుకూలంగా మారేందుకు ఇష్టపడలేదు. 2007లో ‘సలామ్-ఎ-ఇష్క్’ షూటింగ్ టైమ్‌లో, నేను నటించాల్సిన మరో మూవీ స్టార్ హీరో సెట్‌కు వచ్చారు. తర్వాతి నెలలో షూటింగ్ మొదలవనుండడంతో నాకు సపోర్ట్ చేసేందుకు అనుకున్నా.
కానీ దర్శకుడు పొరపాటున నన్ను ఎంపిక చేశారని, ఆ పాత్ర మరో హీరోయిన్ చేయాల్సిందని, మనం మరో సినిమా చేద్దాం అని చెప్పారు. ఇలాంటివి చాలా జరిగాయి. కానీ రాజీపడకుండా నటనపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. నా కష్టమే నా కెరీర్‌ను నిలబెట్టింది.. అవకాశాలు తెచ్చిపెట్టింది” అని చెప్పింది ప్రియాంక. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’తో పాటు మరికొన్ని హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో ఆమె నటిస్తోంది.
