నీట్ పరీక్ష, ప్రశ్నపత్రాల లీకేజీ, విద్యార్థులపై పోలీసుల చర్యలపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వీడియోలు ఉన్నాయని న్యాయవాది చెప్పినా.. వాటిని చూసేందుకు మా వద్ద సమయం లేదు అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
బుధవారం సుప్రీంకోర్టు, జాతీయ రాజధాని ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు నిరాకరించింది. పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపుతో జరిగిన నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు దాడి చేశారనే అంశాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఈ అంశాన్ని అత్యవసరంగా ప్రస్తావించిన న్యాయవాదిని ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్.. మా సమయాన్ని వృథా చేయొద్దు... మీ సమయాన్ని కూడా వృథా చేసుకోవద్దు అని వ్యాఖ్యానించారు.
దీనిపై స్పందించిన న్యాయవాది, నీట్ పరీక్ష సక్రమ నిర్వహణ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో సంస్కరణలు వంటి కీలక అంశాల కోసం విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అయితే ఆయన వాదనను మధ్యలోనే ఆపేసిన ప్రధాన న్యాయమూర్తి, థాంక్యూ వెరీ మచ్ అని అన్నారు.
విద్యార్థులపై పోలీసులు అతిగా వ్యవహరించినట్లు చూపించే వీడియోలు ఉన్నాయని న్యాయవాది చెప్పగా, మాకు వీడియోలపై ఆసక్తి లేదు. వాటిని చూసేందుకు మా దగ్గర సమయం లేదు అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ALSO READ : పార్లమెంట్ దగ్గర టెన్షన్... నల్ల దుస్తులతో కాంగ్రెస్ ఎంపీలు నిరసన
ఇదే అంశంపై దాఖలైన మరో పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ఈ విషయాల్లో కోర్టును లాగొద్దు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.
