నెట్వర్క్, వెలుగు : నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, విద్యార్థులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేల అక్రమ అరెస్టులను ఖండిస్తూ బుధవారం ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని నిరసిస్తూ ధర్నాలు, నిరసన ర్యాలీలు చేపట్టారు. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్యేలు పద్మావతి రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జి. మధుసూదన్ రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్ రెడ్డితో పాటు పలువురు ప్రధాన నాయకులు పాల్గొని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తో చెలగాటమాడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కాలరాయడం, విద్యార్థుల వైపు నిలిచిన ప్రతిపక్ష నేతల గొంతు నొక్కడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.
నీట్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో వెంటనే సమగ్ర చర్చ జరపాలని, పేపర్ లీక్ వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జీకి బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని, రాహుల్ గాంధీతో సహా అరెస్టు చేసిన నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను
ఎత్తివేయాలన్నారు.
