మెదక్, వెలుగు: పర్యాటకాభివృద్ధిలో భాగంగా మెదక్ - కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం వన్యప్రాణి అభయారణ్యంలో సోమవారం రాత్రి క్యాంప్ ఫైర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సీనియర్ కన్సల్టెంట్స్ శవంతి గుప్తా, భువన్ ల బృందం గత ఐదు రోజులుగా జిల్లాలో పర్యాటక ప్రదేశాల సందర్శన ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఎఫ్ ఓ జోజి, జిల్లా పర్యాటక శాఖ అధికారి రమేశ్, డీపీఆర్ఓ రామచంద్ర రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలు, చారిత్రాత్మక, వారసత్వ కట్టడాలు, అభయారణ్యం కలిపి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనలు, సలహాలు, తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్ ప్రత్యేక చొరవ, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్ సహకారంతో జిల్లాలో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర పర్యాటక రంగంలో మెదక్ జిల్లాకు విశేష గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు.
