కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదు.. ఎప్పుడనేది పూర్తిగా CM రేవంత్ ఇష్టం: మహేష్ గౌడ్

కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదు.. ఎప్పుడనేది పూర్తిగా CM రేవంత్ ఇష్టం: మహేష్ గౌడ్

హైదరాబాద్: కొండా సురేఖ బర్తరఫ్‎తో ఖాళీ అయిన స్థానంతో పాటు కేబినెట్‎లో ఖాళీగా ఉన్న మరో స్థానాలను భర్తీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే కేబినెట్ విస్తరణ జరగనుందని పొలిటికల్ సర్కిల్స్‎లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

శనివారం (సెప్టెంబర్ 5) మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన.. కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఢిల్లీలో కేవలం కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని తెలిపారు. కేబినెట్ విస్తరణపై హైకమాండ్‎తో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేయాలనేది పూర్తిగా సీఎం రేవంత్ ఇష్టమని పేర్కొన్నారు.

ఇక, తనకు మంత్రి పదవి రాబోతుందంటూ జరుగుతోన్న ప్రచారంపైన మహేష్ గౌడ్ వివరణ ఇచ్చారు. తనకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. మహేష్ గౌడ్ వ్యాఖ్యలతో కేబినెట్ విస్తరణపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడింది. అసెంబ్లీ సమావేశాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ అనే విషయం స్పష్టమైంది. 

కొండా బర్తరఫ్ పూర్తిగా హైకమాండ్ నిర్ణయం:

మాజీ మంత్రి కొండా సురేఖ బర్తరఫ్‎పైన మహేష్ గౌడ్ స్పందించారు. కొండా సురేఖ బర్తరఫ్ పూర్తిగా ఏఐసీసీ నిర్ణయమని తెలిపారు. ఆమెను కాపాడేందుకు తమ వంతుగా తీవ్రంగా ప్రయత్నించామన్నారు. అయితే ఈ విషయంలో ఏఐసీసీ ఏమాత్రం అంగీకరించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగే విధంగా వ్యవహరించడం వల్లే కొండా సురేఖపై అధిష్టానం చర్యలు తీసుకున్నదని అన్నారు. కొండాను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం బాధాకరమేనని తెలిపారు.

ALSO READ ; ఖబడ్దార్ ..నోరు అదుపులో పెట్టుకో ..

 ఈ విషయంలో తమ చేతిలో ఏమీ లేదని, గతంలో రెండు సార్లు ఫిర్యాదులు వచ్చినప్పుడు సీఎంతో మాట్లాడినట్లు గుర్తు చేశారు. పార్టీ క్రమశిక్షణ విషయంలో కులాలు, మతాలకు తావు ఉండదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ సంఘం ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే కొండా సురేఖ, చిన్నారెడ్డిపై అధిష్టానం చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇకపై ఎవరూ క్రమశిక్షణ ఉల్లంఘించినా ఇదే రీతిలో చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

బర్తరఫ్ తర్వాత కొండా సురేఖ ఆవేశం, ఆవేదనతో మాట్లాడారన్నారు. ఇకపై ఆ విధంగా మాట్లాడొద్దని సూచించారు. పార్టీలో ఏదైనా సమస్య ఉంటే.. పీసీసీ, జనరల్ సెక్రటరీ, రాహుల్ గాంధీతో కూడా మాట్లాడవచ్చన్నారు. బహిరంగ వేదికలపై విమర్శలు చేయవద్దని, వాటిని కాంగ్రెస్ పార్టీ అనుమతించదన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని నమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎప్పడూ ప్రాధాన్యం ఉంటుందన్నారు.