సరిగ్గా 30 ఏళ్ల కిందట ఒక పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా వీధుల్లోకి దిగి, విద్యార్థుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తే ప్రస్తుత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అదే కారణంతో నేడు దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేపడితే వారిపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. "30 ఏళ్ల క్రితం ధర్మేంద్ర ప్రధాన్ చేసినదే ఇప్పుడు విద్యార్థులు చేస్తున్నారు. మరి అప్పటి ఉద్యమం సమర్థనీయం అయితే.. ఇప్పటి ఉద్యమాన్ని మోడీ ప్రభుత్వం ఎందుకు తప్పుపట్టి అణచివేయాలని అనుకుంటోంది?" అనే ప్రశ్నలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
1997లో ఒడిశాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పేపర్ లీక్ వివాదంపై భువనేశ్వర్‌లో రాష్ట్ర సచివాలయం ఎదుట సుమారు 1,500 మంది విద్యార్థులు నిరసన చేపట్టారు. అప్పట్లో ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ఆ ఆందోళనకు నాయకత్వం వహించారు. విద్యార్థి నాయకుడిగా ఆయన ఉద్యమంలో చురుకుగా పాల్గొనగా.. పోలీసులు నిరసనకారులపై చర్యలకు దిగింది.
ధర్మేంద్ర ప్రధాన్ సన్నిహితుడు, ఉత్కల్ యూనివర్సిటీలో ఆయన జూనియర్ అయిన ప్రశాంత్ రౌత్ తెలిపిన వివరాల ప్రకారం.. మొదట ప్రశాంతంగా సాగిన ఆందోళనపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆ ఘటనలో ధర్మేంద్ర ప్రధాన్ తీవ్రంగా గాయపడి, ఆయనకు కొన్ని ఎముకలు విరిగాయని రౌత్ గుర్తు చేశారు. విద్యార్థి రాజకీయాలు హింసాత్మకంగా మారిన మరో సందర్భంలో కూడా ప్రత్యర్థుల దాడి నుంచి ప్రధాన్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఆయన చెప్పారు. కట్ చేస్తో ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ అధికారంలో ఉండి కూడా అవే చేస్తున్నారనే విమర్శలు సోషల్ మీడియాను ముంచేస్తున్నాయి.
18 ఏళ్ల వయసులో విద్యార్థి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ధర్మేంద్ర ప్రధాన్ ఉత్కల్ యూనివర్సిటీలో ఆంత్రోపాలజీ చదివారు. 1994 నుంచి 1997 మధ్య 2 సార్లు ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి సంస్థాగతంగా ఎదిగిన ఆయన.. పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి శాఖలను నిర్వహించిన తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒడిశాలో బీజేపీ పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. 2024లో బీజేపీ తొలిసారి ఒడిశాలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా ఆ దీర్ఘకాల సంస్థాగత కృషికి ఫలితంగా పేర్కొంటారు.
ALSO READ : దెబ్బకు ఇన్స్టాగ్రాం అకౌంట్ డీయాక్టివేట్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ కూతురు !
ఇప్పుడు నీట్-యూజీ పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో నిరసనలకు దిగిన వేలాది మంది విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించగా, వందలాది మంది గాయపడ్డారని, ఒక 21 ఏళ్ల యువతి ఐసీయూలో చికిత్స పొందినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాలతో ధర్మేంద్ర ప్రధాన్ గత విద్యార్థి ఉద్యమం మళ్లీ చర్చకు వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతే నీట్ అంశంపై నిష్పాక్షిక చర్చ సాధ్యమని డిమాండ్ చేయగా.. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, కిరెన్ రిజిజు మాత్రం ఈ అంశంపై చర్చకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
