ఐటీ ఉద్యోగ బాండ్లు చట్టవిరుద్ధం.. హైకోర్టు తీర్పుతో సాఫ్ట్ వేర్ రంగంలో మొదలైన టెన్షన్ !

ఐటీ ఉద్యోగ బాండ్లు చట్టవిరుద్ధం.. హైకోర్టు తీర్పుతో సాఫ్ట్ వేర్ రంగంలో మొదలైన టెన్షన్ !

హైదరాబాద్ ఐటీ రంగం... నిత్యం వేలాది మంది  నూతన అభ్యర్థులకు  ఆశలతో,  ఉన్నతమైన ఆశయాలతో వారికి ఉపాధి కల్పిస్తోంది.  అనేక  సాఫ్ట్‌‌‌‌వేర్  కంపెనీలు ఉద్యోగంలో  చేర్చుకునే  సమయంలోనే  ఉద్యోగ బాండ్లు  బలవంతంగా  రాయించుకుంటున్నాయి.  శిక్షణ పేరుతో  లక్షల రూపాయల పెనాల్టీలు  విధిస్తూ  ఫ్రెషర్ల  భవిష్యత్తును అక్రమంగా బందీగా  మారుస్తున్నాయి.  

ఉద్యోగ బాండ్లను కంపెనీలు ఆర్థిక వేధింపులకు,  బలవంతపు శ్రమకు సాధనాలుగా  మార్చడాన్ని భారత చట్టాలు అస్సలు అంగీకరించవు. తెలంగాణ  హైకోర్టు ఇటీవల  ఐటీ  కంపెనీల దోపిడీపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  కంపెనీలు  బలవంతంగా  వేతనాలు నిలిపివేయడం,  అనుభవ ధృవీకరణ పత్రాలు  ఆపేయడం,  అక్రమంగా  భారీ మొత్తాలు  డిమాండ్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధమని ఉన్నత న్యాయస్థానం  స్పష్టం చేసింది. ఉద్యోగుల  రాజ్యాంగ హక్కులను  కాలరాసే  కంపెనీలకు  న్యాయస్థానం గట్టి హెచ్చరిక జారీ చేసింది.

ఒక ప్రముఖ  సాఫ్ట్‌‌‌‌వేర్ సంస్థ  వ్యవహారంలో  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఐటీ రంగంలో  కొత్త  సంచలనం  సృష్టించింది.  ఒక  సాఫ్ట్‌‌‌‌వేర్  ఇంజినీర్ 2019లో  ఒక  కంపెనీలో  చేరాడు. యాజమాన్యం ఆయనతో  విడతల వారీగా 52 నెలల సుదీర్ఘ  సేవా బాండ్ బలవంతంగా రాయించుకుంది.  రోజుకు 12 నుంచి 15 గంటల  అత్యంత  సుదీర్ఘ  పనివేళలు భరించలేక ఆయన 2023 ఆగస్టులో  రాజీనామా  సమర్పించారు.  

సంస్థ ఆయన రాజీనామాను ఆమోదించడానికి 5.90 లక్షల రూపాయల బాండ్  పెనాల్టీ  చెల్లించాలని తీవ్ర ఒత్తిడి తెచ్చింది.  ఆయనకు రావాల్సిన చివరి నెల వేతనాన్ని ఆపేసింది.  రిలీవింగ్  లేఖను నిలిపివేసింది.  కోర్టును లేదా  కార్మికశాఖను ఆశ్రయించే హక్కు లేదంటూ బలవంతపు డిక్లరేషన్ తీసుకుంది. బాధితుడు చివరకు తీవ్ర మానసిక ఆందోళనకు గురై  నష్టపరిహారం చెల్లించి బయటకు వచ్చి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. బాండ్ల పేరుతో సాగించే అనైతిక వసూళ్లను అక్రమ బందీ చర్యగా అభివర్ణించింది.

భారత కాంట్రాక్ట్ చట్టం 1872  ప్రకారం.. 

భారత కాంట్రాక్ట్ చట్టం 1872  ప్రకారం నియామక బాండ్లు చట్టబద్ధంగా చెల్లుబాటు  కావాలంటే  సంస్థ ఉద్యోగికి తన సొంత ఖర్చులతో ప్రత్యేక శిక్షణ అందించి ఉండాలి.  అలాగే  బాండ్ కాలపరిమితి 1 నుంచి 3 సంవత్సరాల వరకు  మాత్రమే  పరిమితమై ఉండాలి.  ఒకవేళ ఉద్యోగి  నిర్ణీత కాల వ్యవధి కంటే  ముందే రాజీనామా చేసినట్లయితే,  సంస్థ తనకు  జరిగిన  వాస్తవ నష్టాన్ని మాత్రమే పరిహారంగా  కోరడానికి అర్హత కలిగి ఉంటుంది.  

కానీ ఉద్యోగిపై ఎటువంటి  అహేతుకమైన పెనాల్టీలను  విధించకూడదు.  కాంట్రాక్ట్ చట్టం సెక్షన్ 27 ప్రకారం ఒక వ్యక్తికి ఉన్న వ్యాపార,  ఉద్యోగ స్వేచ్ఛను  అడ్డుకునే  ఒప్పందాలు చట్టరీత్యా  చెల్లవు.  కంపెనీ ఒక ఉద్యోగికి  ప్రత్యేకమైన, అత్యంత ఖరీదైన  సాంకేతిక  శిక్షణను అందించినప్పుడు  మాత్రమే  పరిమిత కాలానికి  బాండ్ విధించవచ్చు. ఆరు నుంచి  పన్నెండు  నెలల కాల పరిమితి  మాత్రమే సహేతుకమైనదిగా  చెల్లుతుంది.  కంపెనీ  సాధారణ ఆర్గనైజేషనల్ ఓరియంటేషన్  పూర్తిచేసి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని చెప్పడం కుదరదు. 

చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘన

భారత కాంట్రాక్ట్ చట్టం సెక్షన్ 73, 74  ప్రకారం కంపెనీకి ఉద్యోగి  విధుల నుంచి వైదొలగడం వల్ల ఎంత  ప్రత్యక్ష ఆర్థికనష్టం కలిగిందో  ఆధారాలతో సహా  కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది.  ఆధారాలతో  నిరూపించకుండా లక్షల రూపాయలు  జరిమానాగా డిమాండ్ చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం.  హైదరాబాద్‌‌‌‌లోని అనేక ఐటీ సంస్థలు చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉద్యోగులపై అనుచిత ఒత్తిడి  తెస్తున్నాయి. ఒక బాండ్ గడువు పూర్తి కాకముందే  మరొక  బాండ్  సంతకం చేయించి నిరంతరం కట్టిపడేసే పద్ధతి పూర్తిగా అక్రమం.  

ఉద్యోగి  రాజీనామా చేసినప్పుడు రావాల్సిన జీతాన్ని ఆపేయడం,  రిలీవింగ్ లేఖను,  అనుభవ ధృవీకరణ పత్రాన్ని ఆపేసి వేధించడం చట్టరీత్యా  నేరం.  న్యాయస్థానాలను లేదా  కార్మిక శాఖను  ఆశ్రయించే హక్కు లేదని  ఉద్యోగులతో  బలవంతపు డిక్లేరేషన్లు  రాయించుకోవడం  అసలు చెల్లదు.  కంపెనీ  తన  సొంత ఖర్చులతో ఉద్యోగికి ఎలాంటి ప్రత్యేకమైన సాంకేతిక కోర్సులు నేర్పించకుండా  బాండ్  మొత్తాలు  వసూలు చేయడం చెల్లదు.  కంపెనీలు విధించే ఇటువంటి బలవంతపు షరతులు చెల్లవని,  ఉద్యోగులు  వీటిపై  ధైర్యంగా న్యాయ పోరాటం చేయవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

ఐటీ ఉద్యోగులలో  తీవ్ర మానసిక ఒత్తిడి

ఐటీ రంగంలో సాగుతున్న తీవ్రమైన శ్రమ దోపిడీ, సామాజిక భద్రత లేమిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  రాత్రివేళల్లో సాగే ఆఫ్‌‌‌‌షోర్ షిఫ్టులు, 12 నుంచి 15 గంటల  విపరీతమైన పనివేళలు ఉద్యోగుల శారీరక,  మానసిక  ఆరోగ్యాన్ని తీవ్రంగా  దెబ్బతీస్తున్నాయని న్యాయమూర్తి పేర్కొనడం  గమనార్హం.  ప్రముఖ  ఆసుపత్రులు  నిర్వహించిన  వైద్య పరిశోధనను  ప్రస్తావిస్తూ ఐటీ ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడి,  జీవనశైలి వ్యాధులు,  ఉద్యోగ అభద్రతతో  బాధపడుతున్నారని  కోర్టు గుర్తు చేసింది.  దేశ ఆర్థిక వ్యవస్థకు,  ఆదాయ పన్ను రూపంలో భారీగా సేవలు అందిస్తున్న  సాఫ్ట్‌‌‌‌వేర్  రంగానికి  తగిన  సామాజిక భద్రతా చట్టాలు  లేవని కోర్టు అభిప్రాయపడింది.  

సాఫ్ట్‌‌‌‌వేర్  ఉద్యోగులకు  క్రమబద్ధీకరించిన  పనివేళలు,  ఆరోగ్య భద్రత,  చట్టబద్ధమైన  సామాజిక  రక్షణ  కల్పించడానికి  తెలంగాణ  ప్రభుత్వం ప్రత్యేక సంక్షేమ చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కార్మిక శాఖ నిమ్మకు నీరెత్తిన  వైఖరిని తీవ్రంగా తప్పుబట్టింది.  బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు స్పందించకుండా ఉండటం తగదని స్పష్టం చేసింది.  కంపెనీలు నష్టపరిహారం పేరుతో సాగించే దోపిడీ ఎంతవరకు న్యాయబద్ధమో  కార్మికశాఖ నిశితంగా పరిశీలించాలని ఆదేశించింది.

ఉద్యోగులకు చట్టపరమైన రక్షణ

అక్రమ బాండ్ వేధింపులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు తక్షణమే చట్టపరమైన రక్షణ పొందవచ్చు.  బాధితులు తమ ఆఫర్ లెటర్,  బాండ్ కాపీలు,  జీతం నిలిపివేతను చూపే బ్యాంక్ స్టేట్‌‌‌‌మెంట్లు, ఈ మెయిల్ సంభాషణలను భద్రపరుచుకోవాలి.  

న్యాయవాది ద్వారా కంపెనీకి చట్టబద్ధమైన లీగల్ నోటీసు  పంపాలి.  తెలంగాణ కార్మికశాఖ  కమిషనర్  కార్యాలయంలో అధికారికంగా  ఫిర్యాదు  నమోదు చేయాలి.  రాజ్యాంగబద్ధమైన  హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు  కోర్టు తీర్పును  ఆధారం చేసుకుని  నేరుగా  తెలంగాణ హైకోర్టులో  రిట్ పిటిషన్  దాఖలు చేయవచ్చు.  ఐటీ  ఉద్యోగులు  తమ చట్టబద్ధమైన  హక్కులపై  పూర్తి అవగాహన పెంచుకోవాలి.  కంపెనీలు విధించే అనైతిక  నియమ,  నిబంధనలకు భయపడి లక్షల రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేదు.  

నైపుణ్యంతో  పనిచేసే ఉద్యోగుల శ్రమను దోచుకోవడం మాని,   వారి  సంక్షేమానికి ఐటీ కంపెనీలు పూర్తి జవాబుదారీగా ఉండాలి.  రాష్ట్ర ప్రభుత్వం  కార్మిక రక్షణ చట్టాలను ఐటీ రంగంలో  పకడ్బందీగా అమలు చేయాలి.   నిరుద్యోగుల నిస్సహాయతను  ఆసరాగా  చేసుకుని సాగించే ఆర్థిక దోపిడీకి  తక్షణమే  చరమగీతం పాడాలి.  ప్రతీ ఉద్యోగి  ధైర్యంగా చట్టపరమైన మార్గాలను  ఎంచుకున్నప్పుడే  ఐటీ రంగంలో సాగుతున్న ఈ  కార్పొరేట్  వేధింపులు,  అక్రమాలు,   దోపిడీ శాశ్వతంగా  అంతమవుతాయి.

- డా. కట్కూరి, 
సైబర్ నిపుణుడు

Note:ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com

రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని  హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.