భారత్, అమెరికా దేశాల మధ్య ఒక కొత్త వాణిజ్య ఒప్పందం దాదాపుగా తుది దశకు వచ్చింది. చర్చలు కొలిక్కి వచ్చినట్లే, ఇక సంతకాలే మిగిలాయి అని అధికారులు అంటున్నారు. ఈ ఫిబ్రవరిలో అమెరికాలో కలుసుకున్న మోదీ, ట్రంప్‌ల మధ్య దీని సందర్భం వచ్చినపుడు 'ప్రియ మిత్రుడు ట్రంప్ గొప్ప నిర్ణయం తీసుకుని భారత్ ఎగుమతులపై సుంకం 18%కి తగ్గించారు' అని మోదీ మురిసిపోగా, 'అమెరికా దిగుమతులపై భారత్ జీరో టారిఫ్‌కి ఒప్పుకుంది' అని ట్రంప్ ప్రకటించారు. మోదీ మాత్రం ట్రంప్ చెప్పిన జీరో టారిఫ్ మాటను ఎక్కడా బయటపెట్టలేదు, ఖండించలేదు. అమెరికా దిగుమతులపై మనమెంత సుంకం విధిస్తామో అనేది ఇంకా తేలకుండానే ఈ ఒప్పందం దేశీయ ఉత్పత్తులకు ఎంతో ప్రయోజనకరం అని స్థూలంగా కేంద్ర ప్రభుత్వం అంటోంది. అయితే
ఈ ఒప్పందాన్ని ముందుకు సాగనీయమని పంజాబ్, హర్యానా రైతులు ఇప్పటికే తమ రాష్ట్రాల్లో నిరసనలు మొదలుపెట్టారు.
జులై 21నాడు వారితోపాటు మరిన్ని
రాష్ట్రాల రైతులు కలిసి పెద్ద సంఖ్యలో ఢిల్లీపై దండెత్తారు. రాజధాని కేంద్రంగా ‘కిసాన్ మహా పంచాయత్’ నిర్వహణ వారి లక్ష్యం. అయితే ఢిల్లీ శివార్లలోనే పోలీసులు వారిని అడ్డగించి సభను సాగనీయలేదు. అక్కడికి చేరిన హర్యానా వ్యవసాయ మంత్రి శ్యామ్ సింగ్ రానా వారి వద్ద నుంచి మెమోరాండం తీసుకున్నారు. మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తెస్తాను అని ఆయన హామీ ఇవ్వడంతో వారు వెనక్కి వెళ్లారు. ప్రభుత్వానికి కొంత సమయమిచ్చి తమ తర్వాత చేపట్టే కార్యాచరణను నిర్ణయిస్తామని రైతులు చెప్పారు. రైతుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలపై ఆ ఒప్పందం ఆధారపడి ఉంది.
రైతుల నుంచి తీవ్ర నిరసన
ఈ ఒప్పంద పత్రం ప్రకారం ఇరుదేశాల మధ్య వాణిజ్య మార్పిడిలో డిజిటల్ ట్రేడ్, ఇ కామర్స్, పెట్టుబడులు, సర్వీసులతోపాటు వ్యవసాయ ఉత్పత్తులు కూడా ప్రధానంగా ఉన్నాయి. మన దేశంలోని ఎగుమతులు అమెరికాకు 50%, 25%కి బదులు ఈ మధ్య తగ్గించిన 18% సుంకంతో వెళ్లగా, అమెరికా నుంచి ఇండియాకు వచ్చే దిగుమతులపై అతి తక్కువ సుంకం విధిస్తారని అంటున్నారు.
అమెరికా నుంచి వచ్చేవాటిపై విధించే సుంకమెంతో ఇంకా నిర్ధారణ కాలేదని ప్రభుత్వం చెబుతోంది. మొత్తానికి ట్రంప్ కోరుకున్నట్లు జీరో లేదా అతి తక్కువ టారిఫ్‌తో మన
దేశంలోకి అమెరికా ఉత్పత్తులు వెల్లువెత్తనున్నాయి. ఈ నిర్ణయం పట్ల దేశీయ వాణిజ్య, పెట్టుబడిదారీ వర్గాల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేకున్నా రైతుల నుంచి తీవ్ర నిరసన ఇప్పటికే మొదలైంది.
ఆ సెగలు రాజధానికి తాకుతున్నాయి. కారణమేమంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ ధరకు మన మార్కెట్లోకి వస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. దేశీయ రైతు ప్రయోజనాలను విస్మరించి ఒప్పందాన్ని ఖరారు చేయబోమని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అంటున్నా రైతులు ఆయన మాటను నమ్మడం లేదు. రైతు నేతలతో స్పష్టంగా చర్చించి వారి ఆమోదంతోనే ఒప్పందానికి రావాలని రైతులు కచ్చితంగా అంటున్నారు.
వ్యవసాయానికి అమెరికా భారీ సబ్సిడీలు
సంతకాలు అయ్యాక ఒప్పందాన్ని రద్దు చేయడం కుదరదని ముందు జాగ్రత్తగా వారు తమ నిరసనలను ఆరంభించారు. ప్రత్యేకంగా ఈ ఒప్పందాన్ని రైతులు వ్యతిరేకించడానికి పలు కారణాలు ఉన్నాయి. అమెరికాలో వందలు, వేల ఎకరాల్లో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో ఆధునిక పద్ధతుల ద్వారా సాగు జరుగుతోంది. పంట దిగుబడి అధికంగా ఉంటుంది. పైగా అమెరికా ప్రభుత్వం వ్యవసాయానికి భారీ సబ్సిడీలు ఇస్తోంది. ద్రాక్ష, ఎర్రజొన్నలు, సోయా, చెరుకు, వరి, గోధుమ అమెరికాలోని ప్రధాన పంటలు.
మన దేశంలోని జనాభా అవసరాలు తీరేలా వివిధ పంటల దిగుబడి మన దగ్గరే ఉంది. అయితే ఆ పంటలు అమెరికాలో మనకన్నా తక్కువ పెట్టుబడి, ఎక్కువ సబ్సిడీతో వస్తాయి కావున వాటి ధర సహజంగానే మన దేశీయ పంటలకన్నా చాలా తక్కువగానే ఉంటుంది. వాటికి మన దేశం ఎంత సుంకాన్ని విధించాలో ఎట్లాగూ ట్రంప్‌యే నిర్ణయిస్తాడు. అది అతి తక్కువగా ఉండే అవకాశం ఉంది. మన దగ్గర పండే పంటలకు పోటీగా అమెరికా సరుకును దిగుమతి చేసుకుంటే ఇక్కడి రైతులు సాగు చేయడం దండగగా మారుతుంది. ఇక్కడ రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర రాదు. ఏ దేశమైనా తమ దేశంలో కొరత ఉన్న, అవసరమున్న దినుసులనే దిగుమతి చేసుకుంటుంది.
వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు పొంచి ఉన్న ప్రమాదం
అమెరికా పంటలేవీ మనకు అవసరం లేదు. వాటిని ఒప్పందం ప్రకారం అనుమతిస్తే మన రైతులు పూర్తిగా నష్టపోతారు. ఇప్పటికే అరకొరగా ఉన్న వ్యవసాయ ఆదాయం మొదటికే తగ్గిపోయి రైతు కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆర్థికంగా నష్టపోయి వారు భూములు అమ్ముకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రైవేట్ పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమౌతుంది. ఇప్పటివరకు జరిగిన ఒప్పంద చర్చల్లో పశువుల దాణా, ఎర్రజొన్నలు, సోయా నూనెలు, పండ్ల సరఫరా చేర్చడమైనది. అయితే ఈ లెక్క ఇక్కడితో ఆగుతుందనే గ్యారెంటీ లేదు. క్రమంగా వాటిలో డెయిరీ, పౌల్ట్రీ, చేపలు, గోధుమ, బియ్యం, చక్కెర తదితరాలు చేరిపోవచ్చు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు కూడా దీనివల్ల ప్రమాదం పొంచి ఉంది. అవి దెబ్బతింటే గ్రామీణ ఉపాధిపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అందుకే తమను పక్కనబెట్టి ఒప్పందాలపై సంతకాలు చేస్తే మరో ఉధృతమైన రైతు పోరాటాన్ని చూస్తారని హర్యానా, పంజాబ్ సాగుదార్లు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
- బద్రి నర్సన్
Note: ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
