RTO ఆఫీస్‌‌‌‌ ఎదుట ట్రావెల్స్ బస్సుల యజమానుల ధర్నా

RTO ఆఫీస్‌‌‌‌ ఎదుట ట్రావెల్స్ బస్సుల యజమానుల ధర్నా

హైదరాబాద్, వెలుగు: రవాణా శాఖ అధికారుల వేధింపులను నిరసిస్తూ బుధవారం ఖైరతాబాద్‌‌‌‌లోని ట్రాన్స్‌‌‌‌పోర్ట్ కమిషనర్ కార్యాలయం ఎదుట టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సుల యజమానులు భారీ ధర్నా చేపట్టారు. వివిధ నిబంధనల సాకుతో అధికారులు తమపై అనవసరంగా కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తక్షణమే అధికారుల వేధింపులు నిలిపివేయాలని, లేకపోతే 48 గంటల తర్వాత ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని రవాణా శాఖ అధికారులకు అందజేశారు.

ట్రావెల్స్ యజమానుల ఆరోపణలపై రవాణా శాఖ అధికారులు స్పందించారు. కొందరు ట్రావెల్స్ నిర్వాహకులు ఒక జిల్లాలో తిరిగేందుకు మాత్రమే పర్మిట్ తీసుకుని, అదే పర్మిట్‌‌‌‌తో మూడు, నాలుగు జిల్లాల్లో బస్సులను నడుపుతున్నారని.. ఇది రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. కేవలం నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలపైనే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు.