ఎల్ నినో కారణంగా ఈసారి కరువు కోరల్లో చిక్కుకుపోవాల్సిందేనని భయాందోళన చెందుతున్న రైతులకు ఇది సూపర్ గుడ్ న్యూస్. ఇండియాపై భారీ క్లౌడ్ బ్యాండ్ (మేఘాల పట్టీ) ఆవరించి ఉండటమే ఆ న్యూస్. హిమాలయాలు, చైనా మీదుగా దక్షిణ కొరియా వరకు క్లౌడ్ బ్యాండ్ ఆవరించి ఉన్నట్లు సాటిలైట్ చిత్రాలలో బయటపడింది. ఇది 7 వేల నుంచి 10 వేల కిలోమీటర్ల పొడవునా వర్షపు పట్టీ ఏర్పడటం.. చూస్తే 2026 నైరుతి రుతుపవనాల చాలా చురుకైన దశలలో ఉన్నట్లుగా కనిపిస్తోస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఇండియా అంతటా విస్తారంగా వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్ర నిపుణులు భావిస్తున్నారు.
ఈ క్లౌడ్ బ్యాండ్ నే మాన్ సూన్ కన్వర్జెన్స్ జోన్ అంటారు. ఇది హిందూ మహాసముద్రం నుంచి వీచే తేమతో కూడిన గాలుల కారణంగా ఏర్పడింది. ఇది వేలాది కిలోమీటర్ల మేర విస్తరించి, దాదాపు నిరంతరాయంగా మేఘాలు, వర్షపాతంతో కూడిన ఒక కారిడార్‌కు కారణం అవుతుతున్నట్లు చెబుతున్నారు.
దీని కారణంగా గత రెండు రోజుల్లో దేశంలో సాధారణ వర్షపాతంతో పోల్చితే దాదాపు 170-180 శాతం మేర వర్షం కురిసింది. ఈ సీజన్‌లోనే ఇది అత్యధిక వర్షపాతం అని చెబుతున్నారు. దీన్ని
వాతావరణ శాస్త్రవేత్తలు మాన్ సూన్ డే.. గా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే అనేక ప్రాంతాలలో వర్షపాతం వాతావరణ సగటుల గణాంకాలను మించిపోయింది.
శాటిలైట్ ఇమేజ్ ప్రకారం, సెంట్రల్, నార్త్, ఈస్ట్ ఇండియాలోని చాలా ప్రాంతాలను దట్టమైన మేఘావృతం కప్పివేసి ఉంది. ఆ తర్వాత హిమాలయ పర్వత శ్రేణి మీదుగా ఈశాన్యం దిశగా చైనా , జపాన్ వరకు విస్తరించింది.
రుతుపవన ద్రోణి చురుకుగా ఉన్నప్పుడు, తేమతో కూడిన గాలి పైకి లేచే విశాలమైన ప్రాంతంలోకి చేరినప్పుడు ఇటువంటి పొడవైన బ్యాండ్స్ ఏర్పడతాయి. తేమతో కూడిన గాలి పైకి లేచినప్పుడు, అది చల్లబడి, భారీ వర్షాన్ని కురిపించే మేఘాలుగా మారుతుంది. దీని ఫలితంగా ఆసియాలోని చాలా ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.
కొన్ని వారాలుగా రుతుపవనాలు అస్థిరంగా ఉండటంతో అనేక రాష్ట్రాలు వర్షపాత లోటుతో సతమతమవుతున్న తరుణంలో, వర్షపాతం పెరగటం ఉపశమనంగా పేర్కొంటున్నారు.
ALSO READ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటలకు ఊపిరి పోసిన ముసురు
దీని కారణంగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సిఆర్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి. అదే సమయంలో, బంగాళాఖాతం నుంచి కదులుతున్న అల్పపీడన వ్యవస్థల ప్రభావంతో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు తీవ్రమైన వర్షపాతాన్ని అందుకుంటాయని అంటున్నారు. అయితే ఇది దక్షిణ భారతంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది వేచి చూడాల్సి ఉంది.
