ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటలకు ఊపిరి పోసిన ముసురు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పంటలకు ఊపిరి పోసిన ముసురు

ఆదిలాబాద్, వెలుగు: రెండు రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల్లో ఆశలు చిగురించాయి. ఏకధాటిగా కురుస్తున్న ముసురుతో ఎండిపోతున్న పంటలకు ఊపిరి పోశాయి. పంట విత్తుకుంది మొదలు వర్షాలు లేకపోవడంతో ఇప్పటివరకు స్ప్రింక్లర్ ద్వారా పంటకు నీరు అందించగా, మరికొందరు వానల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో పొలాల్లో రైతులు సాగు పనుల్లో బీజీ అయిపోయారు. కాగా జూలై 20తో పత్తి విత్తనాల గడువు ముగిసినందున ఇకపై పత్తి విత్తకూడదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటికే వేసిన పత్తి పంటలో ఖాళీలు ఉంటే 7 నుంచి 10 రోజుల్లోపు వేసుకోవాలని, మక్కజొన్నను జూలై 31 వరకు విత్తుకోవచ్చని సూచిస్తున్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 32.8 మి.మీ, నిర్మల్ జిల్లాలో 24.1 మి.మీ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 24.3 మి.మీ, మంచిర్యాలలో 23.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 
పెరగని భూగర్భ జలాలు..

ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ భూగర్భజలాలు అడుగంటిపోయాయి. వానాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా భారీ వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు పెరగలేదు. జూన్ నెలలో జిల్లాలో 10.27  మీటర్ల లోతులోకి పడిపోయాయి. ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్, నేరడిగొండ 10 నుంచి 15 మీటర్ల లోతులో పడిపోయాయి. అటు ప్రాజెక్టుల్లోనూ నీటిమట్టం అంతంత మాత్రంగానే ఉంది. 

చెరువుల్లోనూ సగం కూడా నీరు లేదు. సాత్నాల ప్రాజెక్టు నీటి సామార్థ్యం 1.24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.120టీఎంసీలు, మత్తడివాగు ప్రాజెక్టు 0.571 టీఎంసీలకు గానూ 0.110 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉంది. అటు ప్రధాన జలపాతాలు కుంటాల, పొచ్చర, గాయత్రి జలపాతాల్లో జలకళ కనిపించడం లేదు.