గుడిసెవాసుల రీసర్వే త్వరగా పూర్తి చేయాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

గుడిసెవాసుల రీసర్వే త్వరగా పూర్తి చేయాలి: వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు :  జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి గుడిసెలలో, రేకుల షెడ్లలో నివసిస్తున్న 1,367 కుటుంబాల జాబితా రీసర్వే ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుంచి అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్‌‌‌‌తో కలిసి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ లో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం గుడిసెల వాసులకే మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, అందుకే క్షేత్రస్థాయి పరిశీలన వేగవంతం చేయాలని ఎంపీడీవోలకు సూచించారు. ఈ ఏడాది ఎల్‌‌‌‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గనున్న నేపథ్యంలో వరికి బదులుగా కందులు, పెసర్లు, మినుములు, వేరుశెనగ, ఆయిల్ పామ్ వంటి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ, ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జడ్పీ సీఈవో యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఆర్డీఓ ఉమాదేవి, హౌసింగ్ పీడీ విఠోబా, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు తదితరలు పాల్గొన్నారు.