- వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా ముందస్తు ప్రణాళికలు
- చిన్నారెడ్డి అధ్యక్షతన ప్రజా భవన్‌లో నిపుణుల కమిటీ తొలి భేటీ
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తలెత్తుతున్న వర్షాభావ సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం వివిధ శాఖల విభాగాల నిపుణులతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో 27 మంది సభ్యుల నిపుణుల కమిటీ తొలి సమావేశం నిర్వహించారు.
రాబోయే నెలల్లో రాష్ట్రంలో ఎల్‌నినో తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సగటున 30% వర్షపాత లోటు నమోదైందని, మొత్తం 33 జిల్లాలకు గాను 23 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ఏర్పడిన ఎల్‌నినో ప్రభావమే నైరుతి రుతుపవనాలు బలహీనపడటానికి ప్రధాన కారణమన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఐఎండీ, ఇక్రిశాట్, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యాన, పశువైద్య వర్సిటీల శాస్త్రవేత్తలు వివిధ శాఖల ఉన్నతాధికారుల శాస్త్రీయ విశ్లేషణల ఆధారంగా నివేదిక రూపొందించి, ప్రజలతో పాటు వ్యవసాయ రంగానికి తగిన ఉపశమన చర్యలు చేపడతామని వెల్లడించారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి
గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో భూగర్భ నీటి మట్టం ఒక మీటరు మేర తగ్గిందని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి అన్నారు. దీంతో నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ మండలాల వారీగా మార్గదర్శకాలు అందిస్తున్నట్లు వివరించారు.
నీటి పారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ.. ఎగువన మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో వర్షపాతం అనుకున్న స్థాయిలో నమోదు కాలేదని, దీంతో రాబోయే రోజుల్లో తాగు, సాగు నీటి అవసరాలకు అనుగుణంగా జలాశయాల నిర్వహణను జాగ్రత్తగా చేపట్టాల్సి ఉందన్నారు.
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ..వర్షాభావ పరిస్థితులతో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా గ్రిడ్‌పై విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశముందన్నారు. అడవుల్లో నీటి కొరత ఏర్పడితే వన్యప్రాణులు బయటకు వచ్చి మానవులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని పీసీసీఎఫ్ వినయ్ కుమార్ హెచ్చరించారు.
