చేనేతకు ప్రభుత్వాలు అండగా నిలవాలి: బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్

చేనేతకు ప్రభుత్వాలు అండగా నిలవాలి: బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్

పంజాగుట్ట, వెలుగు: చేనేత వృత్తికి ప్రభుత్వాలు మరింత చేయూత ఇవ్వాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు డిమాండ్ చేశారు. చేనేత వస్త్రాలు వాడటం వల్ల ఆత్మాభిమానం పెరుగుతుందని అన్నారు.

బుధవారం బేగంపేటలోని కంట్రీ క్లబ్‌‌‌‌లో నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా వై. వెంకన్న నేత అధ్యక్షతన జరిగిన మీటింగ్‌‌‌‌కు చిరంజీవులు చీఫ్ గెస్ట్‌‌‌‌గా హాజరై మాట్లాడారు. పూర్వకాలం నుంచి దేవతా వస్త్రాలుగా పేరున్న చేనేతకు ప్రస్తుతం ప్రభుత్వాల నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు.

ప్రతి ఏడాది బడ్జెట్‌‌‌‌లో చేనేత రంగానికి సరైన నిధులు కేటాయించడం లేదని, నిధులు లేకుండా ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. చేనేతకు ప్రత్యేక నిధులు కేటాయించి, కార్మికులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.

ఈ ప్రోగ్రామ్‌‌‌‌లో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్, నటి పూనమ్ కౌర్, కంట్రీ క్లబ్ అధినేత వై. రాజీవ్ రెడ్డి, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గజం అంజయ్య, చింతకింది మల్లేశం, చిలువేరి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.