- అక్కడి నుంచి వ్యవసాయానికీ నీళ్లు వాడుకోవచ్చు
- కృష్ణా ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు
- క్యారీ ఓవర్ స్టోరేజీని ఔట్‌సైడ్ బేసిన్‌కూ వాడుకోవచ్చంటూ వితండ వాదన
హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం నీళ్లపై ఏపీ కొత్త రాగం ఎత్తుకుంది. పోతిరెడ్డిపాడును చెన్నై వాటర్ సప్లై కోసం కట్టలేదని వాదిస్తున్నది. కృష్ణా ట్రిబ్యునల్ ముందు తన అతితెలివిని ప్రదర్శిస్తూ వాదనలు వినిపించింది. చెన్నై వాటర్ సప్లై కోసం జరిగిన ఒప్పందాన్నే మార్చి చెప్తున్నది. బుధవారం బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తన వాదనలు వినిపించింది. అయితే, పోతిరెడ్డిపాడు నుంచి చెన్నైకి నీటిని తరలించడం లేదని తెలిపింది.
చెన్నై వాటర్ సప్లై స్కీమ్ ఆఫ్టేక్ పాయింట్ వేరని, చెన్నుముక్కపల్లి వద్ద నుంచి చెన్నైకి తాగునీటి సరఫరా చేస్తున్నామని పేర్కొంది. చెన్నుముక్కపల్లి ఆఫ్టేక్పాయింట్పై మాత్రమే తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటకతో ఒప్పందం జరిగిందని వితండవాదానికి దిగింది. పోతిరెడ్డిపాడు నుంచి చెన్నుముక్కపల్లి మధ్యలో నీటిని వ్యవసాయానికి తరలించుకోవచ్చని తెలిపింది. సర్ప్లస్ స్టోరేజీ నీళ్లను వాడుకునే అన్ని హక్కులూ తమకున్నాయంటూ వాదనలకు దిగింది.
పోతిరెడ్డిపాడును నిర్మించింది కేవలం హంద్రీనీవా, గాలేరునగరి, తెలుగుగంగ ప్రాజెక్టుల కోసమేనని వాదించింది. అదే సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఉన్న క్యారీ ఓవర్ స్టోరేజ్ 150 టీఎంసీలను పూర్తిగా రెండు రాష్ట్రాలకు పంచాలని ట్రిబ్యునల్‌ను కోరింది. ఇప్పుడున్న 299:512 నిష్పత్తిలోనే ఇవ్వాలంది. 80 టీఎంసీలను జూన్, జులై అవసరాలకు ఇన్బేసిన్కే ఇవ్వాలని గత వాదనల్లో తెలంగాణ కోరగా.. ఆ వాదనలను ఏపీ తోసిపుచ్చింది.
అది ఏడాది మొత్తానికి సంబంధించిన నీళ్లని, ఆ నీటిని ఔట్‌సైడ్ బేసిన్‌కూ తరలించుకోవచ్చని ఏపీ పేర్కొంది. కాగా, రాయలసీమ లిఫ్ట్పైనా ఏపీ తన వితండవాదాన్ని కొనసాగించింది. పైనుంచే తాగునీటిని తీసుకెళ్తున్నప్పుడు.. మళ్లీ కింది నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా నీటిని తరలించాల్సిన అవసరం ఏమొచ్చిందని ట్రిబ్యునల్ చైర్మన్ ప్రశ్నించారు. అయితే, కేవలం ఎన్జీటీ ఆదేశాలతోనే ప్రాజెక్టును తాత్కాలికంగా ఆపేశామని, భవిష్యత్‌లో దానిని కట్టి తీరుతామని చెప్పారు. కేవలం తమకున్న హక్కులు, నీటి కేటాయింపులమేరకే వాడుకుంటామని ట్రిబ్యునల్ ముందు వాదించారు
