25 ఏళ్ల క్రితం మన ఇంట్లో ఇవి ఉంటే ధనవంతులం.. ఇప్పుడు ఏకంగా కనుమరుగు అయ్యాయి..!

25 ఏళ్ల క్రితం మన ఇంట్లో ఇవి ఉంటే ధనవంతులం.. ఇప్పుడు ఏకంగా కనుమరుగు అయ్యాయి..!

కాలం ఎంత వేగంగా మారిపోయిందో ఊహించడం కూడా కష్టమే. 20 ఏళ్ల క్రితం అంటే 2000ల కాలంలో మనం టీవీలు, ఈ డిజిటల్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉండేవాళ్లం. కానీ ఈ రోజుల్లో చేతిలో ఫోన్ లేకపోతే ఒక్క క్షణం కూడా గడవదు. టెక్నాలజీ మన జీవితాల్లోకి ఎంతగా వచ్చేసిందంటే, ఒకప్పుడు ప్రతి ఇంట్లో నిత్యం వాడే కొన్ని వస్తువులను మనకు తెలియకుండానే శాశ్వతంగా దూరం చేసింది. మన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసే, ఒకప్పుడు ప్రతి భారతీయుల ఇంట్లో ఉండే.. ఇప్పుడు కనుమరుగైన ఆ వస్తువులేంటో ఒకసారి చూద్దామా..:

1. స్టీల్ టిఫిన్ బాక్స్
మూడు, నాలుగు స్టీల్ డబ్బాలతో ఒకదానిపై మరొకటి గుండ్రంగా ఉండే స్టీల్ క్యారేజ్‌లు ఒకప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉండేవి. బడికి వెళ్లే పిల్లల చేతుల్లో నుండి  ఆఫీసులకు వెళ్లే పెద్దల చేతుల్లో వరకు ఇవే కనిపించేవి. కానీ మైక్రోవేవ్‌లు, ప్లాస్టిక్/సిలికాన్ లంచ్ బాక్స్‌లు వచ్చాక ఈ స్టీల్ టిఫిన్ల వాడకం బాగా తగ్గిపోయింది.

2. రేడియో, ఆడియో క్యాసెట్లు & VCR
ఈ రోజుల్లో మనకిష్టమైన పాటలు వినాలంటే వెంటనే ఇయర్‌ఫోన్స్ లేదా ఇయర్‌బడ్స్ పెట్టుకుంటున్నాం. కానీ అప్పట్లో రేడియోలు, ఆడియో క్యాసెట్లు, వీసీఆర్‌లే (VCR) ఇంటిని నింపేసే వినోదం. మధ్యాహ్నం సమయం ఇళ్లలో రేడియోల్లో 1970, 80ల నాటి పాటలు వినబడటం చాలా సాధారణంగా ఉండేది.

3. ల్యాండ్‌లైన్ ఫోన్
ఒకప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడటానికి ఇంట్లో ఉండే ఏకైక మార్గం ఈ ల్యాండ్‌లైన్ ఫోన్ మాత్రమే. డయల్ తిప్పే లేదా బటన్ల నొక్కే   ల్యాండ్‌లైన్ ఫోన్లు ప్రతి ఇంట్లో హాల్లో ప్రత్యేకంగా కనిపిచేవి. ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు రావడంతో, ల్యాండ్‌లైన్ అనేది ఇళ్లలో కేవలం ఒక షోపీస్‌లా మిగిలిపోయింది.

4. ఇంటి పైకప్పుపై టీవీ యాంటెన్నా
2000ల కాలంలో కలర్ టీవీలు వచ్చినా, ఇంటి దాబా పైన అల్యూమినియం కడ్డీలతో ఉన్న V-షేప్ యాంటెన్నాలు తప్పనిసరిగా ఉండేవి. వర్షం లేదా గాలి వాన వచ్చినా, సిగ్నల్ పోయినా ఒకరు పైన యాంటెన్నా తిప్పుతుంటే, ఇంకొకరు కింద "టీవీ వస్తుందా?" అని అరిచే రోజులు గుర్తుండే ఉంటాయి. ఇప్పుడు కేబుల్, డిష్‌ టీవీలు, ఓటీటీలు వచ్చాక ఇవి కనుమరుగయ్యాయి.

5. రుబ్బురాయి
అప్పట్లో పచ్చళ్లు రుబ్బాలన్నా, మసాలాలు దంచాలన్నా ప్రతి ఇంట్లోనూ రాతి రోలు, రోకలిని వాడేవారు. అలా రోట్లో నూరిన వంటల రుచే వేరు. కానీ ఇప్పుడు మిక్సర్లు, గ్రైండర్లు, ఫుడ్ ప్రాసెసర్లు అందుబాటులోకి రావడంతో అంత కష్టపడే పని లేకుండా పోయింది.

6. మెడలో వేలాడే వాటర్ బాటిల్స్
మనం చిన్నప్పుడు బడికి వెళ్లేటప్పుడు  నీళ్లు తాగడానికి స్ట్రా ఉండి, మెడలో వేలాడదీసుకునే ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను వాడేవాళ్లం. ఇప్పటి పిల్లల చేతుల్లో అలాంటి బాటిళ్లను చూద్దామన్నా కనిపించడం లేదు.