ఒక డీసీపీ స్థాయి వ్యక్తికి ఇది తగునా..? మహిళపై చేయి చేసుకున్న ఆఫీసర్ జంతర్ మంతర్ విధుల నుంచి ఔట్

ఒక డీసీపీ స్థాయి వ్యక్తికి ఇది తగునా..? మహిళపై చేయి చేసుకున్న ఆఫీసర్ జంతర్ మంతర్ విధుల నుంచి ఔట్

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేపీ కార్యకర్తలు, విద్యార్థులు చేస్తున్న ధర్నాను అణచివేసేందుకు పోలీసులు, కేంద్ర బలగాలు వ్యవహరించిన తీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిన్న పిల్లలు, మహిళలు అని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా కొట్టడం చూసి దేశం అంతా దిగ్ర్భాంతికి గురవుతున్న పరిస్థితి. ఒక డీసీపీ స్థాయి ఆఫీసర్ సంయమనం కోల్పోయి మహిళ అని కూడా చూడకుండా చేయి చేసుకోవడం తీవ్ర వివాదాన్ని రేపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ అధికారిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ మొదలైంది. 

ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలుపుతున్న మహిళపై చేయి చేసుకున్న అడిషనల్ డీసీపీ సందీప్ లంబా ను సస్పెండ్ చేయాలనే డిమాండ్ పెరుగుతున్న క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను జంతర్ మంతర్ విధులనుంచి తప్పించింది. 

జులై 20వ తేదీన సీజేపీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమంలో ఆందోళనలో పాల్గొన్న యువతిని..మహిళ అని కూడా చూడకుండా చెంపకేసి కొట్టాడు ఏడీసీపీ సందీప్ లంబా.  ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాక్రోచ్ పార్టీ.. ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. 

సోనం వాంగ్చుక్ జుట్టు లాగింది ఇతడే..

నిరసన కారులపై సందీప్ లంబా ప్రవర్తన దారుణంగా ఉందని సీజేపీ ఆరోపిస్తోంది. ఇదే ఆఫీసర్ సోనం వాంగ్ చుక్ సతీమణి గీతాంజలి వాంగ్చుక్ జుట్టు లాగినట్లు సీజేపీ ఆరోపించింది. ట్రక్కులో ఉన్న ఆమెపై చేయి చేసుకునేందుకు ఏకంగా ట్రక్కు ఎక్కి ఆమె జుట్టు లాగారని సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ట్వీట్ చేశారు. 

గంటల వ్యవధిలోనే వీడియో వైరల్ అవ్వడంతో పోలీసు అధికారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. ఆయనను సస్పెండ్ చేయాల్సిందిగా పార్లమెంట్ స్ట్రీట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ సాకేత్ గోఖలే పోస్ట్ చేశారు. 

►ALSO READ | నీట్, జేఈఈ ఎగ్జామ్స్ నిర్వహించే NTAలో పర్మినెంట్ ఉద్యోగులు 24 మందినేనా.. అందుకేనా ఇన్ని పేపర్ లీక్స్..!

ఒక మహిళపై డీసీపీ స్థాయి అధికారి ప్రవర్తన ఇలా ఉండటమేంటి..? ఇది మీకు తగునా అన్నట్లుగా సోషల్ మీడియాలో దుమారం రేగింది. దీంతో ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విమర్శలు తలెత్తడంతో డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా లంబాను జంతర్ మంతర్ విధుల నుంచి తప్పించింది.