ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. జంతర్ మంతర్ ప్రాంతంలో ఇంటర్నెట్పై ఆంక్షల విషయంలో పోలీసులు, సీజేపీ నిరసనకారుల మధ్య తీవ్ర వాగాద్వం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొందరు నిరసనకారులు పోలీసులను లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతంగా మారింది.
దీంతో పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులపై ఎదురు దాడి చేశారు. దీంతో పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ పరిణామాలతో జంతర్ మంతర్‌లో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మరోవైపు.. సీజేపీ నిరసనలతో ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, సోషల్ మీడియా ద్వారా ఆకతాయిలు పుకార్లు వ్యాప్తి చేయకుండా ఉండేందుకు జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా పోలీసుల, భద్రతా బలగాల అదుపులో ఉందని ఉన్నతాధికారులు వెల్లడించారు.
జంత్ మంతర్‌లో ఇంటర్నెట్ బంద్
నీట్ 2026 పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ వరుస ఆందోళనలతో గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడతాయని తెలిపారు.
జంతర్ మంతర్‌లో వరుస ఆందోళనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు.. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జంతర్ మంతర్ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
జంతర్ మంతర్ ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని భారీగా బలగాలను మోహరించారు. జంతర్ మంతర్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుతంగా చేస్తోన్న విద్యార్థుల నిరసనను అణగదొక్కేందుకు మోడీ సర్కార్ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు.
►ALSO READ | వరుస నిరసనలతో ఢిల్లీ షేక్.. జంతర్ మంతర్‌లో ఇంటర్నెట్ బంద్
