ప్రధాన్ రాజీనామా చేయాలి.. మోడీ క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ డిమాండ్

ప్రధాన్ రాజీనామా చేయాలి.. మోడీ క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ డిమాండ్

న్యూఢిల్లీ: నీట్ 2026 పేపర్ లీక్‎కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అలాగే, నీట్ పేపర్ లీక్‏కు వ్యతిరేకంగా నిరసన చేసిన విద్యార్థులపై పోలీసుల సాగించిన దమనకాండపై ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‎పై బుధవారం (జులై 22) ఢిల్లీలోని ఇందిరా భవన్‎లో రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులపై లాఠీచార్జ్ అత్యంత బాధాకరమని అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థుల హక్కును ప్రభుత్వం హరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు.  

విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా ఫెయిల్

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‎పై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. దేశంలో విద్యావ్యవస్థను ప్రధాన్ భ్రష్టుపట్టించాడని అన్నారు. నీట్ తో పాటు పలు పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేశారు. 

బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో విద్యావ్యవస్థ పూర్తిగా నాశనం అయ్యిందని విమర్శించారు. నిత్యం ఏదో ఒక చోట ఎగ్జామ్  పేపర్లు లీక్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపుడు భారత విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే నంబర్ వన్ ఉండేదని.. మోడీ హయాంలో విద్య పూర్తిగా వ్యాపారమైపోయిందని ధ్వజమెత్తారు. 

మోడీ హయాంలో 152 ఎగ్జామ్ పేపర్లు లీక్ కాగా 7.5 కోట్ల విద్యార్థులపై ప్రభావం చూపిందన్నారు.  కానీ ఇప్పటి వరకు ఒక్క నిందితుడిని  ప్రభుత్వం శిక్షించలేదని నిప్పులు చెరిగారు. పన్నెండేళ్లలో బీజేపీ ప్రభుత్వం ఎడ్యుకేషన్ సిస్టమ్‎ను నాశనం చేసిందని మండిపడ్డారు. ఒక్క పరీక్ష కూడా కేంద్రం సరిగా నిర్వహించలేదన్నారు. 

పేపర్ లీకేజీలతో లక్షలాది కుటుంబాలపై పెను భారం పడిందని.. ఎన్నో ఫ్యామిలీలు ఆర్థికంగా చితికి పోయాయన్నారు. పేపర్ లీకేజీతో 1.32 కోట్ల ప్రజా ధనం వృథా అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తుపై కేంద్రానికి పట్టింపు లేదని ధ్వజమెత్తారు.