దేశవ్యాప్తంగా హైవే ప్రయాణాన్ని వేగంగా, సులభంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జాతీయ రహదారులపై టోల్ చెల్లింపుల కోసం వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా బ్యారియర్-ఫ్రీ టోల్ కలెక్షన్ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. FASTag, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, AI విశ్లేషణలతో ఈ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.
రాజ్యసభలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలను వెల్లడించారు. GPS ఆధారిత టోల్ వసూలు విధానంపై నిపుణుల కమిటీలు కొన్ని ఆందోళనలు వ్యక్తం చేశాయని, ముఖ్యంగా భద్రత, గోప్యత, డేటా ఉల్లంఘన ప్రమాదాలు, నిర్వహణ నియంత్రణ అంశాలపై మరింత చర్చ అవసరమని సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో విధానాన్ని అమలు చేయడంపై దృష్టి పెట్టింది. ఈ విధానంలో వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగకుండా ప్రయాణిస్తాయి. FASTag ద్వారా ఎలక్ట్రానిక్ చెల్లింపులు జరుగుతాయి. అవసరమైన చోట కెమెరాలు వాహన నంబర్లను గుర్తించి AI సాయంతో టోల్ లావాదేవీలను నిర్వహిస్తాయి.
దేశంలోని 17 టోల్ ప్లాజాల్లో కొత్త సాంకేతికత అమలు కోసం ఇప్పటికే కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందులో గుజరాత్‌లోని చోర్యాసి, ఢిల్లీలోని ముండ్కా, హర్యానాలోని ఘరౌండా, రాజస్థాన్‌లోని మనోహర్‌పురా, దౌలత్‌పురా వంటి 5 ప్రాంతాల్లో ఇప్పటికే ఈ విధానం ప్రారంభమైంది. మిగిలిన ప్రాంతాల్లో కూడా దశలవారీగా అమలు చేయనున్నారు. ఈ టెక్నాలజీని మరింత విస్తరించేందుకు అదనంగా మరో 104 టోల్ ప్లాజాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. దీంతో దేశవ్యాప్తంగా హైవే ప్రయాణంలో పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది.
ఇదే సమయంలో FASTag వినియోగం కూడా భారీగా పెరిగింది. 2025 ఆగస్టు 15న ప్రారంభించిన నాన్-కమర్షియల్ కార్లు, జీపులు, వ్యాన్ల కోసం వార్షిక FASTag పాస్‌కు మంచి స్పందన లభించింది. 2026 జూన్ నాటికి 77 లక్షలకు పైగా వార్షిక పాస్‌లు జారీ కాగా, వాటి ద్వారా 63 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ వసూళ్లలో 98 శాతానికి పైగా FASTag ద్వారానే జరుగుతున్నాయి. భవిష్యత్తులో AI ఆధారిత టోల్ వ్యవస్థతో ట్రాఫిక్ తగ్గడం, ప్రయాణ సమయం ఆదా కావడం, మరింత పారదర్శకమైన టోల్ నిర్వహణ సాధ్యమవుతుందని కేంద్రం భావిస్తోంది.
