రవీంద్రభారతి,వెలుగు : తెలంగాణ వైతాళికుడు, ప్రముఖ కవి, రచయిత డా. దాశరథి కృష్ణమాచార్య తన రచనలు, కవిత్వం, పాటల ద్వారా సమాజాన్ని చైతన్యపరిచారని సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ వెన్నెల గద్దర్ అన్నారు. భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డా. దాశరథి కృష్ణమాచార్య 101వ జయంతి ఉత్సవాలు, దాశరథి సాహితీ పురస్కార ప్రదానోత్సవం బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వెన్నెల గద్దర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏ. వాణీ ప్రసాద్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటేశ్వర్లుకు ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారాన్ని , రూ.1,01,116 నగదు బహుమతిని అందించారు.
దాశరథి స్ఫూర్తితోనే ప్రయాణం : గుడిపాటి
తాను కాలేజీలో ఉన్నప్పటి నుంచే దాశరథి సాహిత్యంతో అనుబంధం ఏర్పడిందని, సూర్యాపేట, ఉస్మానియా క్యాంపస్ లైబ్రరీలు తన సాహిత్య అధ్యయనానికి ఎంతో దోహదపడ్డాయని అవార్డ్ గ్రహీత గుడిపాటి వెంకటేశ్వర్లు అన్నారు. అవార్డు అందుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. ఉద్యమాలు చేస్తూ ఎక్కువ కాలం జైలు జీవితం గడిపిన వారిలో దాశరథి ఒకరని, వారి జీవితం
ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి అని గుర్తు చేశారు.
