న్యూఢిల్లీ, వెలుగు: రేషన్ షాపుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రాలకు ఆర్థిక సహాయం అందించే స్కీమ్ ఏది తమ వద్దని లేదని కేంద్రం వెల్లడించింది. అందువల్ల తెలంగాణలోని రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా తెలిపారు.
తెలంగాణలోని 17,114 రేషన్ షాపుల్లో ఒక్కో షాపునకు ₹14,250 చొప్పున మొత్తం ₹24,38,74,500 ఆర్థిక సాయం ఇవ్వాలని కోరిందని వెల్లడించారు. 2025 మార్చిలో ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్లు చెప్పారు. అయితే, ఈ తరహా సాయానికి సంబంధించి కేంద్రంలో ఎలాంటి స్కీమ్ లేదని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపామన్నారు.
ఇందుకు సంబంధించి 2025 జులై 17న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ ద్వారా వెల్లడించామన్నారు. ఈ మేరకు లోక్‌సభలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఈటల రాజేందర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
