అదనంగా 8 లక్షల టన్నుల బియ్యం.. కొనుగోలుకు కేంద్రం ఆమోదం

అదనంగా 8 లక్షల టన్నుల బియ్యం.. కొనుగోలుకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు: ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025–26 (రబీ పంట)కు సంబంధించి అదనంగా 8 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్ఎంటీ) బియ్యాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఈ మేరకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శికి అధికారికంగా లేఖ రాసింది. దీంతో సవరించిన వరి కొనుగోలు అంచనా బియ్యం రూపంలో 43 ఎల్ఎంటీలకు చేరింది.

రబీ సీజన్ ప్రారంభానికి ముందే తెలంగాణ నుంచి 35 ఎల్ఎంటీల బియ్యం (52 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) సేకరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయితే, రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని కోటా పెంచాలని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి జూన్ 21న రాసిన లేఖను సైతం ప్రస్తావిస్తూ కేంద్రం అదనపు కోటాను మంజూరు చేసింది. అలాగే, ఈ నెల 8న తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశమై విజ్ఞప్తి చేశారు. ఈ దిశలో కేంద్ర ప్రభుత్వం సానుకూలం నిర్ణయం తీసుకుంది. 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పెంపు అనేది 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యంతో సమానమని కేంద్రం తెలిపింది. తాజా పెంపుతో మొత్తం బియ్యం సేకరణ లక్ష్యం 43 లక్షల మెట్రిక్ టన్నులకు (64 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం) చేరినట్టు వెల్లడించింది.   

వీఎల్‌‌‌‌టీఎస్ పూర్తి చేయాలని కండీషన్..
అదనపు బియ్యం కొనుగోలుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వం.. ఒక కీలక కండీషన్ ను పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ (వీఎల్‌‌‌‌టీఎస్)ను 2026 సెప్టెంబర్ 30 లోపు తప్పనిసరిగా, పూర్తిగా అమలు చేయాలని లేఖలో స్పష్టం చేసింది. ఇందుకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

కాగా.. తెలంగాణకు అదనపు బియ్యం సేకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం అంగీకరించిన 8 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు బియ్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా బియ్యాన్ని సేకరించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌‌‌‌సీఐ)కి సకాలంలో అందజేయాలన్నారు.

గత మార్కెటింగ్ సీజన్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యాన్ని నిర్ణీత గడువులోగా ఎఫ్‌‌‌‌సీఐకి ఇవ్వలేకపోయిందన్నారు. బియ్యాన్ని అప్పగించడంలో విఫలమై, అదనపు గడువు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా పక్కా ప్రణాళికతో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని హితవుపలికారు.

రైతుల ప్రయోజనాల దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్‌‌‌‌లో ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌‌‌‌ను కలిసిన బండి సంజయ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినట్టు మీడియాకు వెల్లడించారు.