హైదరాబాద్, వెలుగు: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ ఆత్మను, ప్రజల ఆకాంక్షలను తన కవిత్వంలో ప్రతిబింబించిన మహోన్నత కవి అని మంత్రి జూపల్లి కృష్ణారావు కొనియాడారు. మహాకవి దాశరథి కృష్ణమాచార్యుల 101వ జయంతి వేడుకలు తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర భాషా–సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మహాకవి దాశరథి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఆయన సాహిత్యం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం ప్రముఖ కవి అందెశ్రీ రచించిన సాహిత్యం పాటల పూదోట – అందెల సవ్వడి గ్రంథాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. బాలాచారి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, దాశరథి కుమార్తె ఇందిరా, సభ సమన్వయకర్త బడే సాబ్, కవులు అమ్మంగి వేణుగోపాల్, గంటా మనోహర్ రెడ్డి, సంఘన భట్ల నరసయ్య, రామకృష్ణ చంద్రమౌళి పాల్గొన్నారు.
