వైఎస్ వివేకా హత్య కేసులో జగన్, భారతికి భారీ ఊరట

వైఎస్ వివేకా హత్య కేసులో జగన్, భారతికి భారీ ఊరట

హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య విషయాన్ని వైఎస్‌ జగన్‌కు, భారతికి చెప్పడంలో తప్పులేదని సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. వివేకా హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలన్న సునీత పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఆర్డర్ కాపీలో సీబీఐ కోర్టు కీలక అంశాలు ప్రస్తావించింది. వివేకా మరణించిన తర్వాత అతని సమీప బంధువులకు విషయం తెలియజేయడం సహజం అని సీబీఐ కోర్టు అభిప్రాయపడింది. 

వివేకా హత్య విషయాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్‌ భారతికి చెప్పడంలో తప్పులేదని సీబీఐ కోర్టు తెలిపింది. వైఎస్‌ రాజారెడ్డికి, చిన్న కొండారెడ్డికి ఏదో చిన్నచిన్న ఆస్తి తగాదాలు ఉన్నంత మాత్రాన సాక్ష్యాలు లేకుండా ఆరోపణలు చేయడాన్ని స్వాగతించలేమని సీబీఐ కోర్టు తీర్పు సందర్భంగా పేర్కొంది.

Also Read : పోలవరం - నల్లమలసాగర్‌‌‌‌ను అడ్డుకోండి.. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్

జగన్‌కు, వివేకాకు మధ్య వివాదాలు ఉన్నాయని సునీత తరఫు న్యాయవాది సమర్పించిన వాదనకు ఆధారాలు లేవని సీబీఐ కోర్టు తేల్చింది. వైఎస్ వివేకా హత్య కేసులో చార్జిషీట్‌ ఇప్పటికే సమర్పించారని, అందులో ఎక్కడా వైఎస్‌ జగన్‌ ప్రస్తావన లేదని సీబీఐ కోర్టు గుర్తుచేసింది. హత్య జరిగిన రోజు ఉదయం 05:30 గంటలకు జగన్‌మోహన్ రెడ్డి ఫోన్ కాల్ స్వీకరించిన విషయమై మరింత దర్యాప్తు అవసరం లేదని పిటిషనర్కు సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. కిరణ్ యాదవ్కు, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనుమడైన అర్జున్ రెడ్డికి మధ్య వివేక హత్య జరిగిన రోజు మెసేజ్లపై మాత్రమే దర్యాప్తు చేయండని సీబీఐ కోర్టు ఆదేశించింది.